హెల్త్ అండ్ వెల్త్ బాధితులకు నంద్యాల కలెక్టర్ హామీ

నంద్యాల ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లా లోని దొర్నిపాడు మండలంలో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ పేరుతో ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటనపై బాధితులకు న్యాయం చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్‌.ఎస్ హాల్ లో, హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించిన బాధితులతో కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “హెల్త్ అండ్ వెల్త్” అనే సంస్థ “వర్క్ ఫ్రమ్ హోమ్” పేరుతో ఉద్యోగాలివ్వాలన్న నెపంతో సుమారు 850 మంది బాధితుల నుండి ఒక్కొక్కరి వద్ద 3.6 లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు. ఒక్కొక్కరు నెలకు అరగంట పని చేస్తే రూ.40 వేల జీతం ఇస్తామని చెప్పి చాలామందిని నమ్మబలికారని చెప్పారు.

దీంతో బాధితులు ఇంట్లోని బంగారం, ఇళ్లు, ఆస్తులను తాకట్టు పెట్టి ఆ సంస్థ నిర్వాహకులకు డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. ఈనెల జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. బాధితులు ఇప్పటివరకు సంస్థ నుండి ఎటువంటి అగ్రిమెంట్ లేదా లిఖిత పూర్వక ఒప్పందం తీసుకోలేదని…. వారు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు డాక్యుమెంటేషన్, దర్యాప్తు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

బాధితులు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తే త్వరితగతిన న్యాయం చేస్తామన్నారు. అలాగే, పోలీస్ శాఖ ఇప్పటికే హెల్త్ అండ్ వెల్త్ సంస్థ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉందని, వీటి ద్వారా డబ్బు ప్రవాహంపై లోతైన విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

బాధితులు ఎటువంటి ధర్నాలు, గందరగోళాలు చేయకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలి” అని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ, హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఈనెల 14వ తేదీన అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు అయిన అనంతరం చట్టపరమైన అన్ని ప్రక్రియలు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

బాధితులు తమ వద్ద ఉన్న సంబంధిత వివరాలు, సాక్ష్యాలు, బ్యాంక్ రసీదులు వంటి సమాచారాన్ని పోలీసు శాఖకు అందిస్తే, విచారణ మరింత సులభతరం అవుతుందన్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే సంస్థ నిర్వాహకుల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను గుర్తించే ప్రక్రియలో ఉందని తెలిపారు.

అవసరమైన ఆధారాలు సేకరించిన తర్వాత, ఆస్తులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం, తద్వారా బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం,” అని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు చట్టపరమైన దశల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి రెండు నుండి మూడు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. బాధితులు ఎటువంటి ఆందోళన గానీ, అశాంతి గానీ చెందకుండా పోలీస్ యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తే, తప్పకుండా త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ తెలిపారు

Leave a Reply