ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కల్వర్టుకు గండి

–కల్వర్టు గేట్ పక్కన కూలిన అంచు
— కట్ట తెగితే పెద్ద ప్రమాదమే
— కల్వర్ట్ పై ప్రమాదకరంగా గుంతలు

హుజూర్‌నగర్ , ఆంధ్ర‌ప్ర‌భ : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అనుబంధంగా నిర్మించిన ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కల్వర్టు ప్రమాదకర స్థితిలో ఉంది. హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందాపురం నుండి ఫణిగిరి గుట్టకు సాగునీరు పంపించే 19.83 ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ గేట్ పక్కన కల్వర్ట్ ఇటీవల కురిసిన వర్షాలకు, వాటర్ ఫ్లో కు కూలిపోయింది. ఇదే కాకుండా సింగారం నీటి స‌ర‌ఫ‌రా చేసే కల్వర్ట్ రోడ్ పైన పెద్ద గుంత పడింది. ఈ రోడ్డుపై రాక‌పోక‌లు చేసే వాహ‌న‌దారులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. 19.83 ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కల్వర్టు పక్కన అంచు కూలిపోయి ప్రమాదకరంగా మారిందని వాటర్ ఫ్లో పెరిగినప్పుడు మరింత కోతకు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇదే విషయం ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఖరీఫ్ సీజన్ వరకు ఎటువంటి పనులు చేయలేమని, నీళ్లు ఆపి పనులు చేయాలన్న ఇప్పుడున్న పరిస్తితి లో రైతులకు నీళ్లు ఆపలేమని అధికారులు చెపుతున్నారు. కాల్వకట్ట తెగితే వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడమే కాకుండా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కు సాగునీటిని నిలుపుదల చేయాల్సిన పరిస్తితి వస్తుందన్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులు తాత్కాలికంగా కెనాల్ గేట్ పక్కన అంచు నీటికోతకు గురికాకుండా తాత్కాలిక చర్యలు తీసుకోవాలని, కల్వర్టులపై ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి నూతన కల్వర్ట్ నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుచున్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు
హుజూర్ నగర్ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ కల్వర్టు నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పంపించామని హుజూర్ నగర్ ఇరిగేషన్ శాఖ ఈఈ రాంకిషోర్ తెలిపారు. 19.83 ఎంబీ కెనాల గేట్ పక్కన అంచు నీటి కోతకు గురికాకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Leave a Reply