Earthquake | ఢిల్లీ, బీహార్ లలో భూకంపం
ఢిల్లీ, బీహార్ లలో సోమవారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. ముందుగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకోగా ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే బిహార్ రాష్ట్రంలో మరోసారి భూకంపంసంభవించింది. ఉదయం 8.02 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సివాన్‌లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
అంతకుముందు తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ ,నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడం తో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని పేర్కొన్నారు.
మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు.