Ponnuru | ఆర్టీసీ బస్సు తో ఆటో ఢీ – ముగ్గురు మహిళలు మృతి

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ:వారంతా దినసరి కూలీలు. తెల్లవారకముందే కాలకృత్యాలు తీర్చుకునే పొట్టకూటి కోసం పొలం పనులకు బయలుదేరారు. అదే వారికి చివరి మజిలీ అవుతుందని ఊహించలేకపోయారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నారాకోడూరు బుడంపాడు మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు.

చేబ్రోలు మండలం శుద్దపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో నీరుకొండ గ్రామానికి మిరప పొలంలో పనిచేసేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ని ఆటో డీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురి మహిళలు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి కాళ్లు చేతులు విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

.మృతి చెందిన వారిని అరుణ, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. గాయాలపారైన వారిని వెంటనే అంబులెన్స్ లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ఆసరాగా నిలిచారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకొని వారి వంతు సాయం అందించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొగ మంచు కారణంగా బస్సు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికంగా ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వరుస ప్రమాద సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, రెండు రోజుల క్రితం ముప్పాళ్ళల్లో జరిగిన ప్రమాదం, ఆదివారం కోటనెంబర్ జరిగిన ప్రమాదాలను మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో ప్రమాదం ఆందోళన గురిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *