అక్కడకు కూడా డ్రోన్ వెళుతుందా..?

అక్కడకు కూడా డ్రోన్ వెళుతుందా..?

ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లాలోని మొంథా తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో పంటల‌తో పాటు ర‌హ‌దారులు, వంతెన‌లు, ఇళ్లు త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల‌కు నష్టం కలిగింది. అయితే.. జరిగిన న‌ష్టాన్ని వేగ‌వంతంగా, ఖచ్చితంగా, అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అంచ‌నా వేసేందుకు డ్రోన్ సాంకేతిక‌త‌(Drone technology)ను వినియోగిస్తున్న‌ట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

బుధ‌వారం క‌లెక్ట‌రేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ తుఫాను న‌ష్టాల‌ను ప్రాథ‌మికంగా అంచ‌నా వేసేందుకు డ్రోన్ కార్పొరేష‌న్ ద్వారా తొలిసారిగా అందుబాటులోకి వ‌చ్చిన డ్రోన్ల ప‌నితీరును ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ… తుఫాను ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌కు వీలైనంత త్వ‌ర‌గా స‌హాయ‌స‌హ‌కారాలు అందించే ల‌క్ష్యంతో న‌ష్టాల‌ను స‌త్వ‌రం అంచ‌నా వేసేందుకు ఆధునిక సాంకేతికత దోహ‌దం చేస్తుంద‌న్నారు. జిల్లాలోని 20 మండ‌లాల్లో న‌ష్టాల అంచ‌నాల‌కు గాను ఒక్కో మండ‌లానికి ఒక డ్రోన్ టీమ్ ప‌ని చేస్తోంద‌ని వివ‌రించారు.

సంప్ర‌దాయ ప‌ద్ధ‌తులతో పోల్చితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతిక‌త ద్వారా ఖచ్చిత‌మైన ఆధారాల‌తో న‌ష్టాల‌ను అంచ‌నా వేయొచ్చ‌న్నారు. హై రిజల్యూషన్(high resolution) ఇమేజరీ, ఫుటేజీ ద్వారా ఇది సాధ్య‌ప‌డుతుంద‌న్నారు. మ‌నుషులు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోకి సైతం డ్రోన్ల‌ను పంపి.. అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకొని న‌ష్టాన్ని విశ్లేషించేందుకు డ్రోన్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. డిజిట‌ల్ మ్యాపులు(digital maps), ఫొటోలు, 3డీ న‌మూనాల రూపంలోనూ పంట న‌ష్టం నివేదిక‌ల‌ను రూపొందించి పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందించ‌ వ‌చ్చ‌న్నారు.

డ్రోన్ సాంకేతిక‌త ద్వారా సేక‌రించిన డేటా ఆధారంగా పున‌రుద్ధ‌ర‌ణ, పునర్నిర్మాణ పనులను సైతం స‌త్వ‌రం చేప‌ట్టేందుకు వీలుంటుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ(Collector Lakshmi) తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని త్వ‌ర‌గా, స‌మ‌ర్థ‌వంతంగా అందించేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

Leave a Reply