తేమ శాతం పేరుతో కొనుగోలు చేయని సీసీఐ

తేమ శాతం పేరుతో కొనుగోలు చేయని సీసీఐ
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా(Narayanapet District) ఊట్కూర్ మండల పరిధిలోని పత్తి రైతులు ఆందోళనకు దిగారు. త్రిప్రాసుపల్లి విజయ కాటన్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. తేమ ఎక్కువగా ఉందని అధికారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు నారాయణపేట – మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ఎక్కడి వాహనాలు(Vehicles) అక్కడే నిలిచిపోయాయి.
రైతులు విజయ కాటన్ మిల్లు(Vijaya Cotton Mill) వద్ద ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రామ్ లాల్, ఊట్కూర్ ఎస్సై రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము ఎంతో కష్టపడి పండించిన పత్తి పంట విక్రయానికి తీసుకువస్తే అధికారులు అధిక తేమ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తూ పత్తి కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సీఐ, ఎస్ఐ, సీసీఐ(CI, SI, CCI) అధికారులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

