తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం

తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం

తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ): జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. మొంథా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరం(Tirupati city) లో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనాల రాక‌పోకలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాలు, లక్ష్మీపురం సర్కిల్, ఆటోనగర్, లీలామహల్ సర్కిల్, వెస్ట్ చర్చి గేట్ రాయల్ చెరువు రోడ్డు, డీఆర్ మహల్ రోడ్ ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జిల్లో నీరు నిలిచిపోయింది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లిన వారు వర్షంలో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి తలుపులు దాటి బయటకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి.

జిల్లాలో విస్తారంగా వర్షాలకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ (Collector Venkateswar), ప్రత్యేక అధికారి అరుణ్ బాబు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం రేణిగుంట మండలం ఎర్రమరెడ్డి బాల్యం చెరువును పరిశీలించారు. తిరుపతి రూరల్ పరిధి చిగురువాడ సమీపంలోని స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ నాయకులు అధికారులు పరిశీలించారు.

తుఫాను ప్రభావం (Storm effect) తో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొరలి పొంగుతున్నాయి. శ్రీకాళహస్తి మండలం ముళ్ళపూడి సెంటర్ వద్ద ఈదుల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. అలాగే కమ్మ కొత్తూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోవడంతో సిబ్బంది రంగంలోకి దిగి మ్మరమత్తు పనులు చేపట్టారు.

Leave a Reply