మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్ లొంగుబాటు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : అజ్ఞాతం వీడి మావోయిస్టు కీలక నేతలు వరుసగా లొంగు “బాట” పడుతున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న మరో మావోయిస్టు ఉద్యమ నేత బండి ప్రకాష్ (Bandi Prakash) అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ కు తోడు దండకారణ్యంలో ఉద్యమo బలహీనపడిన నేపథ్యంలో సికాస కార్యదర్శి బండి ప్రకాష్ 45 ఏళ్ల సుదీర్ఘ పోరుబాటను వీడి అనారోగ్య సమస్యలతో డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. ఆయుధాలను కూడా అక్కడే వదిలేసి పార్టీ అనుమతి తీసుకుని పోలీసుల ముందుకు వచ్చినట్టు సమాచారం.
జైలు నుండి తప్పించుకొని.. అంచెలంచెలుగా ఎదిగి…!
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బండి ప్రకాష్ 45 ఏళ్ల సుదీర్ఘ మావోయిస్టు ఉద్యమం (Maoist movement) లో కీలక పాత్ర పోషించారు. మందమర్రి 1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్ యూ తరఫున విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించి ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం(సి.కా.స.) అధ్యక్షుడిగా పనిచేశారు. సికాస వ్యవస్థకు ఊపిరి పోసి కార్మిక సంఘాలకు గొంతుకగా బండి ప్రకాష్ గుర్తింపు తెచ్చిపెట్టి పోలీసులకు సవాల్ గా మారారు.
1985లో అరెస్ట్ అయిన బండి ప్రకాష్ ఆదిలాబాద్ జిల్లా కారాగారంలో కానిస్టేబుల్ తుపాకీ లాక్కొని జైలు గోడలు ఎక్కి అగ్రనేత ఆది రెడ్డితో కలిసి పారిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తరువాత అంచలంచలుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఎక్కాడు. నేషనల్ పార్క్ ఏరియా ఛత్తీస్గఢ్, బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్ గా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
సింగరేణి కార్మిక సమాఖ్య (Singareni Labor Federation) మావోయిస్టు అనుబంధ సంఘాన్ని అంచలంచెలుగా విస్తరించి కార్మికుల హక్కులు సమస్యలపై తెర వెనుక నుండి పోరాటాలకు వ్యూహం రచించడంలో దిట్టగా చెబుతారు. ఇప్పటివరకు పోలీసులతో జరిగిన 9 ఎన్కౌంటర్ ఘటనల నుండి తప్పించుకుని పోలీసులకు పెద్ద సవాల్ గా మారాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సికాసా కార్యదర్శిగా, దండకారణ్యం ఆర్గనైజర్ గా పనిచేస్తున్న బండి వయోభారంతోనే అనారోగ్య సమస్యలకు గురై లొంగిపోయినట్టు తెలిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అనుమతి కూడా తీసుకొని అక్కడే ఆయుధాలు వదిలిపెట్టినట్టు విశ్వసినీయంగా తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు బండి ప్రకాష్ లొంగుబాటును ధ్రువీకరించాల్సి ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కు చెందిన సీనియర్ మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోవడం సర్వత్రా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.

