Cyclone Montha | తీరప్రాంతాల్లో అలజడి!

హుద్‌హుద్ తుఫాన్ గుర్తు చేసుకుంటున్న జ‌నం

మొంథా తుఫాన్‌ ప్రభావంతో తీరప్రాంతాలు అలజడిగా మారాయి. సముద్రం తీరం ఎగ‌సిప‌డుతుండ‌టంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉప్పాడ, కాకినాడ తీరాల్లో బలమైన గాలులు, ఎగసిపడే అలలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.

తుఫాన్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మొంథా మంగళవారం ఉదయానికల్లా తీవ్రమైన తుఫానుగా మారి, అదే రోజు రాత్రికి కళింగపట్నం–మచిలీపట్నం మధ్య కాకినాడకు సమీపంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.

ఈ సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు 2014లో విశాఖపట్నంపై విరుచుకుపడిన హుద్‌హుద్‌ తుఫాన్‌ భీకరతను గుర్తుకు తెస్తున్నాయి. అప్పుడు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన హుద్‌హుద్‌ సుమారు రూ.21 వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

మొంథా వేగం హుద్‌హుద్‌ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎటువంటి రిస్క్‌ తీసుకోకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పరిసరాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో అధికారులు 16 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, దాదాపు 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply