రక్తసంబంధం వీడనంది!
శిశు ఇవ్వడాన్ని అడ్డుకున్న పిల్లలు.. అయినా
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : కన్నపేగు కాదంటే.. రక్త సంబంధం రమ్మంటుంది..! కన్నపేగు తెంచుకుని ఓ ఆడ శిశు భూమి మీదకు పడిన తర్వాత ఆ తల్లి కాదు పొమ్మంటూ ఎవరికో అమ్మజూపింది. అయితే తోబుట్టువులు మాత్రం చెల్లిని ఎవరికీ ఇవ్వొద్దు అంటూ ప్రాథేయపడిన సంఘటన పలువురు కలచివేసింది. అమ్మా చెల్లిని అమ్మోద్దే నీకు దండం పెడతాను చెల్లిని మనమే ఉంచుకుందాం అంటూ బిడ్డలు తల్లి కాళ్ల మీద పడి ఎక్కి ఎక్కి ఏడ్చినా ఆ తల్లి మనసు కరగలేదు. నాలుగో కాన్పులో పుట్టిన ఆడ శిశువును కర్కశంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి అమ్ముకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా (Nalgonda District) తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో వెలుగు చూసింది.
శిశు విక్రయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
ఎల్లాపురం తండా (Yellapuram Thanda) కు చెందిన కొర్ర బాబు, పార్వతి దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మూడో కాన్పులో జన్మించిన ఆడ శిశువు . ఆ శిశువు కూడా కనిపించకుండా పోయింది. ఆ శిశువును కూడా అమ్ముకున్నారని కొంతమంది ఆరోపిస్తుండగా చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. 20 రోజుల క్రితం నాలుగో కాన్పులో జన్మించిన ఆడ శిశువును సాకలేమని భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును అమ్మకానికి పెట్టారు. దళారుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి రెండు రోజుల క్రితం రూ. 3 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ఆ శిశువును వేరే వారికి ఇవ్వడానికి పిల్లలు అడ్డుకున్నారు. దీన్నిపై ఐసీడీఎస్ అధికారులు తండాకు వెళ్లి విచారణ ప్రారంభించారు.

