ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజలు..
- సంచలన కేసులో అసలు నిజాలు..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో తుది తీర్పును ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కోర్టు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు(Judge Srinivasa Rao) ప్రకటించారు. ఈనెల 24న ఈ కేసులో తీర్పు ఇస్తూ ఐదు మందిని ఈ కేసులో దోషులుగా తేల్చింది.
కేసులో ఏ1 నుండి ఏ5 వరకు ఉన్న ఐదు ముద్దాయిల పై హత్య నేరం రుజువైందని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. వారికి అక్టోబర్ 27 వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించారు. 27వ తారీఖున వారికి శిక్షను ఖరారు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఐదు మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరపరిచారు. కోర్టు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది.
ఇందుకు సంబంధించిన శిక్ష ఖరారు తుది తీర్పును ఈ నెల 30 కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ6 నుండి ఏ23 వరకు ఉన్న ముద్దాయిల పై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. హత్యా నేరం కేసులో చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్(Jayaprakash Reddy, Manjunath), వెంకటేష్ ఐదు మంది మీద నేరం రుజువు అయ్యింది.
ఈ రోజు దోషులకు శిక్షణ ఖరారు చేస్తామని కోర్టు ప్రకటించడంతో చిత్తూరు పట్టణంలో బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. కోర్టు లోపల బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసు వివరాలను పరిశీలిస్తే… 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఛాంబర్ లోని సీటులో కూర్చుని విధి నిర్వహణలో ఉండగా, ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తుపాకులు, కత్తులతో మేయర్ ఛాంబర్(Mayor Chamber)లోకి దూసుకుని వచ్చారు. మేయర్ అనూరాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.
ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు. దీంతో నగర పాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కటారి అనూరాధ, మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ తోపాటు ఈ కుట్ర వెనుక ఉన్న 23 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఎయిర్ ఫోర్స్(Air Force) నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు. మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
2016 ఫిబ్రవరి 18వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11.45 గంటలకు నిందితులు చంద్రశేఖర్, వెంకటచలపతి ఆనే ములబగల్ వెంకటేష్ తుపాకులు, ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కలిసి వచ్చారు.
మేయర్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్త కటారి మోహన్(Katari Mohan) పై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి, ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం ఏ1 నుంచి ఏ23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నడం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములయ్యారని చార్జ్ షీట్‌లో ఆరోపించారు.
పట్టపగలు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య ఘటన సంచలనం రేకెత్తింది. పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీర్ఘకాలం విచారణ సాగింది. ఈ కేసులో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు మరణించారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏ22 కసారం రమేష్(Kasaram Ramesh) కేసు నుంచి విడుదలయ్యాడు. ఏ21 ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి మరణించాడు. ఏ3, ఏ4గా ఉన్న నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. హత్య కేసులో ప్రధాన నిందితులు చంద్రశేఖర్, వెంకట చలపతి అనే మూలబగల్ వెంకటేష్ బెయిల్ పై బయట ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈనెల 30వ తేదీన నిందితులకు కోర్టు ఎటువంటి శిక్ష విధిస్తుందో అని చిత్తూరు పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

