ఇదే కాంగ్రెస్ రెండేళ్ల పాలన మార్క్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఇదే రెండేళ్ల కాంగ్రెస్(Congress) పాలన మార్క్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే , మాజీ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఈరోజు షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి పాలన, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బుల్డోజర్ పాలన నడుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పడిందని అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్.. బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి…
తెలంగాణలో రేవంత్‌రెడ్డి, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుందని మండిపడ్డారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీ టీం అంటున్నాయని విమర్శించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
రాహుల్ సొంత మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని పొగుడుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్న మౌనంగా ఉంటున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి తెలియదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు.
అగ్రశ్రేణి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దాం..
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్క సంవత్సరంలోనే అపార్ట్‌మెంట్‌ల నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో జనరేటర్లు, ఇన్వర్టర్ల పరిస్థితి లేకుండా నిరంతర విద్యుత్ అందించగలిగామన్నారు. హైదరాబాద్ నగర ప్రగతి, శాంతి భద్రతలపై అనుమానాలు ఉన్నవాటన్నిటిని తొలగించి అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల కోసం 204 గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సహాయం(Foreign Education Aid) కింద ప్రత్యేకంగా రూ.20 లక్షల స్కాలర్‌షిప్ కూడా ఏర్పాటు చేశారు. విద్యావంతులు పోలింగ్ రోజు బయటకు వచ్చి సరైన నిర్ణయం తీసుకోవాలని, ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

