డాక్టరాసురుడు……..
ఆయనకు డబ్బు జబ్బు
నొప్పి వస్తుందని తిరిగి వెళ్తే రక్తం పలుచబడేందుకు మరో వైద్యం
నడవలేని స్థితిలో రోగి నీమ్స్ లో అడ్మిట్
అత్యాధునిక వైద్య పరీక్షల అనంతరం ఆపరేషన్
వైద్య పరీక్షల్లో నరాల్లోని గైడ్ వైర్ మెడ నరాల వరకు పాకిందని తేలిన వైనం
ఆపరేషన్ చేసి గైడ్ వైర్ ను మరిచారు : పూజిత, రేడియాజిస్ట్, నీమ్స్
ఆపరేషన్ చేసి రోగి శరీరం నుండి గైడ్ వైర్ ను బయటకు తీసిన నిమ్స్ వైద్యుడు డాక్టర్ సందీప్ మల్హోత్రా
వివరణ కోసం సంప్రదిస్తే అందుబాటులోకి రాని వైద్యుడు కిరణ్ కుమార్
బాధితురాలు పిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
నిర్లక్ష్యపు వైద్యులను శిక్షించాలి: అరుణ, రోగి
(ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ బ్యూరో) : వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణ సంకటంగా మారుతుంది. వేరికోస్ వైద్యం కోసం వైద్యుణ్ణి సంప్రదిస్తే వైద్యం చేసిన వైద్యుడు రోగి నరాల్లోనే గైడ్ వైర్ ను మరిచాడు. రోజుల తరబడి గైడ్ వైర్ నరాల్లోనే ఉండటంతో కాలు వాచి చీము పట్టింది. వైద్యం చేస్తే వికట్టించింది ఏమిటా అంటూ రోగి అరుణ తిరిగి వైద్యుణ్ణి సంప్రదిస్తే రక్తం గడ్డకట్టిందని ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే మందులు ఇచ్చాడు. అవి వాడినా ప్రయోజనం లేకపోవడంతో అరుణ నిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. అక్కడ అధునాతన పరీక్షలు చేసి రోగి శరీరంలో ఉన్న గైడ్ వైర్ ను తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.. ఒకరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరొక వైధ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగికి పునఃజన్మ ప్రసాదించారు..
ఉమ్మడి మెదక్ బ్యూరో, అక్టోబర్ 25 ( ఆంధ్ర ప్రభ): సనాతన ధర్మంలో వైద్యులను వైద్యో నారాయణ హరి అంటూ సాక్షాత్తు దేవదేవుడితో పోల్చారు. కానీ కొందరు వైద్యులు చేస్తున్న నిర్లక్ష్యం అమాయక రోగుల పాలిట శాపంగా మారుతుంది. గొల్లపల్లి కి చెందిన అరుణ జనవరి 27న వేరికోస్ తో బాధపడుతూ… జిల్లా కేంద్రంలోని చరిత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. పరీక్షలన్నీ చేసిన వైద్యుడు కిరణ్ కుమార్ వేరికోస్ కు వైద్యం చేయాలని ఆపరేషన్ ద్వారా నరాల్లోని చెడు రక్తం తొలగించాల్సి ఉంటుంది.. ఇందుకోసం అడ్మిట్ కావాలని సూచించారు. వైద్యుడి సలహా మేరకు రోగి అరుణ జనవరి 30న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకుని ప్రాణాలను రక్షించుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి కి చెందిన అరుణ (39) నడవలేని కాలు నొప్పితో బాధపడుతూ జనవరి 27న జిల్లా కేంద్రంలో గల చరిత ఆస్పత్రిలోని వైద్యుడు కిరణ్ కుమార్ ను సంప్రదించింది. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యుడు కిరణ్ రోగి అరుణ కు ఆపరేషన్ చేయాలని నరాల్లో చెడు రక్తం కారణంగా నొప్పి వస్తుందని నరాల్లోకి వైర్ ను పంపి చెడు రక్తం తొలగించాల్సి ఉంటుందని ఇందుకోసం అడ్మిట్ కావాలని సూచించారు. వైద్యుడి కిరణ్ సలహా మేరకు జనవరి 31 న రోగి అరుణ ఆపరేషన్ చేయించుకుంది. నెలలు గడుస్తున్నా కాలు నొప్పి తగ్గకపోవడం ఆపరేషన్ చేసిన ప్రదేశం నుండి చీము కారుతుండటంతో తిరిగి వైద్యుడు కిరణ్ ను సంప్రదించారు.

ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే రక్తం చిక్కగా ఉందని అందుకనే నొప్పి తిరగపెట్టిందని దీని కారణంగానే చీము వస్తుందని డ్రెస్సింగ్ చేసి రక్తం పలుచబడేందుకు మందులు ఇచ్చి పంపించారు. వైద్యుడు కిరణ్ తిరిగి ఇచ్చిన మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులను సంప్రదించింది. నిమ్స్ డాక్టర్ సందీప్ మల్హోత్రా అరుణను పరీక్షించి సీటీ వినోగ్రామ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇచ్చారు. సంగారెడ్డి లోని షైన్ డయాగ్నొస్టిక్ లో సీటీ వినోగ్రామ్ పరీక్ష చేయించుకుని నీమ్స్ లోని ఇంటర్వెన్షల్ రేడియలజిస్ట్ డాక్టర్ పూజిత కు పరీక్షల తాలుకు రిపోర్టులు చూయించగా గతంలో వేరికోస్ ఆపరేషన్ చేసిన వైద్యుడు అరుణ కాలులోని నరాల్లోనే గైడ్ వైర్ ను మరిచాడని తేలింది. నిమ్స్ వైద్యుడు సందీప్ మల్హోత్రా అరుణకు ఆపరేషన్ చేసి నరాల్లో కూరుకుపోయిన సుమారు మీటర్ పొడవు గల గైడ్ వైర్ ను తొలగించి అరుణ ను ప్రాణపాయ స్థితి నుండి కాపాడారు.
ఆపరేషన్ చేసి గైడ్ వైర్ ను మరిచారు: పూజిత, రేడియాజిస్ట్, నీమ్స్
రోగి అరుణ కు గతంలో వేరికోస్ సర్జరీ చేసిన వైద్యుడు ఆమె నరాల్లోనే గైడ్ వైర్ ను వదిలేశాడు. దాదాపు పది నెలల పాటు గైడ్ వైర్ నరాల్లోనే ఉండటంతో అది మెల్లిమెల్లిగా రక్తంలో ప్రవహించి మెడ వరకు చేరుకుంది. సీటీ వినోగ్రామ్ పరీక్ష చేయించిన అనంతరం మేము ఈ విషయాన్ని ధృవీకరించి వెంటనే డాక్టర్ సందీప్ మల్హోత్రా అరుణకు ఆపరేషన్ చేసి గైడ్ వైర్ ను
ఆమె శరీరం నుండి బయటకు తీశారు..
నిర్లక్ష్యపు వైద్యులను శిక్షించాలి: అరుణ, రోగి
కుడి కాలు లో భరించలేని నొప్పి వస్తుందని సంగారెడ్డి లోని చరిత ఆసుపత్రిని సంప్రదించా. డాక్టర్ కిరణ్ కుమార్ నాకు అన్ని రకాల పరీక్షలు చేసి వేరికోస్ ఆపరేషన్ చేశాడు. జనవరిలో ఆపరేషన్ చేసుకుంటే దాదాపు 7, 8 నెలల పాటు ఆపరేషన్ చేయించాక నొప్పి ఎక్కువైందని ఆపరేషన్ చేసిన ప్రదేశం నుండి చీము వస్తుందని చాలా ఇబ్బంది ఉందని బ్రతిమలాడా. ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే నా రక్తం చిక్కగా ఉందంటూ పలుచబడేందుకు వైద్యుడు కిరణ్ కుమార్ అదనంగా మందులు ఇచ్చాడు. అవి వాడినా నొప్పి తగ్గలేదు. నీమ్స్ లోని వైద్యులను సంప్రదిస్తే సీటీ వినోగ్రామ్ పరీక్ష చేయించుకుని రమ్మన్నారు. ఆ పరీక్ష చేయించుకుని వెళ్తే వేరికోస్ ఆపరేషన్ చేసిన వైద్యుడు నా కాలు నరాల్లో గైడ్ వైర్ ను మరిచిపోయాడని అది మెల్లిమెల్లిగా నా మెడ వరకు చేరిందని నా అదృష్టం కొద్ది ఏ ఉపద్రవం వాటిల్లేదని పేర్కొన్నారు.
అందుబాటులోకి రాని వైద్యుడు కిరణ్ కుమార్..
సంగారెడ్డి లో రోగి అరుణకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కిరణ్ కుమార్ ను వివరణ కోరేందుకు ఆంధ్ర ప్రభ రెండు రోజులు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆంధ్ర ప్రభ సంగారెడ్డి లోని చరిత ఆసుపత్రికి వెళ్ళి సంప్రదిస్తే విజయవాడకు వెళ్ళారని సమాధానమిచ్చారు. కిరణ్ కుమార్ ను ఫోన్ లో సంప్రదిస్తే తన ఫోన్ నిమిషాల కొద్ది ఎంగేజ్ లోనే ఉండటం గమనార్హం.
ఎఫ్ఐఆర్ నమోదు: క్రాంతి కుమార్, రూరల్ సీఐ..
రోగి అరుణ లిఖిత పూర్వక పిర్యాదు మేరకు చరిత ఆస్పత్రి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశాం.. విచారణ చేసిన అనంతరం చర్యలు తీసుకుంటాం.

