నంద్యాలకు డేంజర్
- జిల్లాకు భారీ తుఫాన్ హెచ్చరిక
- మూడు రోజులు భారీ వర్ష సూచన
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాజకుమారి
నంద్యాల, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో నంద్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం సూచించారు.. భారీ తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర యంత్రాంగం అధికారులను అప్రమత్తం చేసింది. రాబోయే సోమ మంగళ బుధవారాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని అందుకు అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు.
భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ముఖ్యంగా రైతులకు ప్రత్యేక సూచన చేశారు. పంట పండి చేతికొచ్చినమొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మట్టి మిద్దెల క్రింద నివాసం ఉండవద్దు అన్నారు. వర్షాలకు మట్టి మీద నాని కూలిపోయే పరిస్థితులు ఉన్నందున అధికారులు వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, స్తంభాలకు కరెంటు వచ్చే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.

