క‌ర్నూల్ దుర్ఘ‌ట‌న‌లో త‌ల్లీకుమారుడు మృతి

క‌ర్నూల్ దుర్ఘ‌ట‌న‌లో త‌ల్లీకుమారుడు మృతి

పటాన్ చెరు, ఆంధ్ర ప్రభ : ప‌టాన్‌చెరులోని బంధువుల‌ ఇంట్లో దీపావళి సరదాగా చేసుకుని తిరుగు ప‌య‌నంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న‌ప‌టాన్‌చెరుకు చెందిన త‌ల్లీకుమారుడు క‌ర్నూల్ బ‌స్సు దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు తెల్ల‌వారు జామున మూడు గంటలకు కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్ బస్ ద‌గ్ధంలో చిక్కుకున్న బెంగళూరుకు చెందిన ఫిలమిన్ బేబీ (62) ఆమె కుమారుడు కిషోర్ కుమార్ (41) మృతి చెందారు. స్థానిక సమాచారం ప్రకారం బెంగళూరు కు చెందిన వీరిద్ద‌రూ దీపావళి పండుగకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృషి డిఫెన్స్ లో నివాసముంటున్న తమ బంధువుల ఇంటికి వ‌చ్చారు. పండ‌గ‌ను స‌ర‌దాగా చేసుకున్నారు. నిన్న రాత్రి తిరుగు ప్రయాణంలో భాగంగా పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి 8:20 సమయంలో కావేరీ పికప్ వ్యాన్ ఎక్కి కూకట్ పల్లికి చేరుకుని రాత్రి తొమ్మిది గంటల సమయంలో కావేరి బస్సు ఎక్కారు.

బ‌స్సు ద‌గ్ధ‌మైన దుర్ఘ‌ట‌న‌లో చిక్కుకుని త‌ల్లీ కొడుకులిద్ద‌రూ సజీవ దహనమయ్యారు. తిరుగు ప్రయాణంలో తల్లి కొడుకులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. యాదాద్రి యువ‌తి కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూష రెడ్డి మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష రెడ్డి దీపావళి పండుగ నిమిత్తం సొంత ఊరుకు వ‌చ్చి నిన్న రాత్రి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. రాత్రి ఖైర‌తాబాద్ లో వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు ఎక్కారు. అదే బ‌స్సు ప్ర‌మాదానికి గురికావ‌డంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply