రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం
నల్లగొండ, ఆంధ్రప్రభ : రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) కోరారు. ఈ రోజు ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌరసఫరాలు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి సరైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు.
అన్ని కొనుగోలు కేంద్రాలలో లారీలు సైతం సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ ధాన్యం తేమశాతాన్ని, కొనుగోలు కేంద్రాల(Purchase centers) కు వచ్చే ధాన్యం వివరాలన్నింటినీ రికార్డులు నిర్వహించాలని చెప్పారు. ఆయా కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేయడాన్ని పూర్తిచేయాలని, హడావుడిగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించే క్రమంలో చెత్త, చెదారం వంటివి సంచులలో నింపవద్దని, అలా చేస్తే సెంటర్ నిర్వాహకులతో పాటు, సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని, ఇందుకుగాను ఓబి ఎంఎస్ విధానాన్ని (OB-MS procedure) వేగవంతం చేయాలని చెప్పారు. రైస్ మిల్లర్లు ఇంకా ఎవరైనా బ్యాంక్ గ్యారంటీ సమర్పించనట్లయితే తక్షణమే సమర్పించే విధంగా మిల్లర్లతో మాట్లాడి పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కు సూచించారు. ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనట్లయితే తక్షణం ప్రారంభించాలని ఆదేశించారు.
కోతలు ఆపు చేయాలి…
వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజులు రైతులు వరి కోతలు ఆపు చేయాలని, వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ (collector) కోరారు. ఈ అంశంపై డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసి హార్వెస్టర్లు ,రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ధాన్యం సేకరణ పై కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు మాట్లాడారు.

