పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా…
ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు నగరంలోని మామునూర్ నాలుగో బెటాలియన్ అధికారులు, సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నాలుగో బెటాలియన్ కమాండెంట్ డి శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీ మొదటగా బెటాలియన్ మొదటి గేటు నుండి ప్రారంభమై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వరకు తిరిగి మామునూర్ మీదుగా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ నుంచి తిరిగి మామునూరు క్యాంపు వరకు సాగింది. ఈ బైక్ ర్యాలీలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ డి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బైక్ లపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందాలని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారిలో హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా ఉన్నారని కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ పి శ్రీనివాసరావు, వీరన్న, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విజయ్, కార్తీక్, రవి, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, కృష్ణ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.