కాల్పుల కేసు కీలక విషయాలు ఇవే

కాల్పుల కేసు కీలక విషయాలు ఇవే

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పాత కక్షలతోనే సోనూసింగ్‍ పై ఇబ్రహీం, అతని స్నేహితులు కాల్పులు జరిపారని రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) చెప్పారు. సోనూసింగ్ వల్ల వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడని, కొన్ని రోజులుగా సోనూసింగ్, ఇబ్రహీం, మిగతా నిందితుల మధ్య ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. మేడ్చల్ జిల్లా పోచారంలో గోరక్షక్ ప్రశాంత్‌ సింగ్‌ అలియాస్ సోనూసింగ్‍ పై (Sonu Singh) కాల్పుల ఘటన నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. కలిసి మాట్లాడుకుందామని సోనూసింగ్‍ను యంనంపేట సమీపంలోని వెంచర్ లోకి ఇబ్రహీం అతని స్నేహితులు తీసుకెళ్లి కాల్పులు జరిపారని చెప్పారు.

ఘటనాస్థలానికి అందరూ వచ్చిన తర్వాత గంటసేపు వీరు మాట్లాడుకున్నారని.. ఆ తర్వాతే కాల్పులు జరిపారని తెలిపారు. ఈ కాల్పుల కేసులో ఇబ్రహీంతో పాటు మోసిన్, శ్రీనివాస్‍లను అరెస్టు చేశారని పరారీలో ఉన్న హనీఫ్ ఖురేషి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడంతో పాటు నిందితులను పట్టుకున్నామన్నారు. ఇది అకస్మాత్ గా జరిగిన ఘటన కాదని.. అందరూ అనుకునే కలుసుకున్నారని చెప్పారు. వీళ్ల మధ్య జూలై నుంచి సంబంధాలు ఉన్నాయని.. పూర్తి విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను రూమర్స్ ను నమ్మవద్దని కోరారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మళ్లీ మీడియాకు వివరిస్తామన్నారు.

Leave a Reply