ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం – రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగర శివారులోని పోచారం (Pocharam) ఐటీ కారిడార్‌లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ (Sonu Singh) అలియాస్ ప్రశాత్ సింగ్ కాల్పుల ఘటనను హిందూ సంఘాలతో పాటు బీజేపీ (BJP), బీజేవైఎం (BJYM)లు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మతోన్మాద అల్లర్లను ప్రేరేపిస్తూ హిందువులను అణచివేసేలా నిరంకుశంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇవాళ బీజేవైఎం డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే, డీజీపీ కార్యాలయానికి బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో సహా ఆ పార్టీ నేతలను పోలీసుల అసెంబ్లీ ఎదుట అడ్డుకున్నారు. అనంతరం వారు డీజీపీ కార్యాలయంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. రాంచందర్ రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchander Rao) మాట్లాడుతూ.. పోచారంలో గోరక్షక్ (Gorakshak) కార్యకర్త పై ఎంఐఎం (MIM) దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారని ఆరోపించారు. ఆ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇదే విషయమై తాము డీజీపీకి మెమోరాండం ఇవ్వడానికి వస్తే.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఎంఐఎం కార్యకర్తలు, గుండాలను పోషిస్తుందని ఫైర్ అయ్యారు. వారిని బీజేపీ కార్యకర్తలు, గోరక్షక్ కార్యకర్తల పైకి ఉసిగొల్పుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కార్ వచ్చిన నాటి నుంచి నగరంలో ఎంఐఎం ఆరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. పోలీసుల ఉదాసీన వైఖరితోనే ఇలాంటి ఘటనను చోటుచేసుకుందటున్నాయని.. నిందితుల పై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.