ఐఫోన్‌ బదులు ఐక్యూ ఫోన్‌ అంటగట్టిన ఈకామర్స్ దిగ్గజం

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థపై కర్నూలు జిల్లా కన్జ్యూమర్‌ ఫోరం గట్టి చర్య తీసుకుంది. ఫోరమ్‌ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో సంస్థపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్ బి డబ్ల్యూ ) జారీ చేసింది. ఈ తీర్పు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఐఫోన్‌ ఆర్డర్డిస్తే, ఐక్యూ ఫోన్‌ డెలివరీ

కర్నూలు జిల్లాకు చెందిన ఒక వినియోగదారు అమెజాన్‌ ద్వారా రూ.80 వేల విలువైన ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫోన్‌ను ఆర్డర్‌ చేశారు. అయితే డెలివరీ సమయంలో ఐఫోన్‌ బదులు ‘ఐక్యూ’ బ్రాండ్‌ ఫోన్‌ పంపడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు.

కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌తో పలుమార్లు సంప్రదించినా ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయన కర్నూలు జిల్లా కన్జ్యూమర్‌ ఫోరంను ఆశ్రయించారు. కన్జ్యూమర్‌ ఫోరం విచారణ జరిపి బాధితుడి వాదనలు సమర్థించుకుంటూ అమెజాన్‌పై కఠిన నిర్ణయం తీసుకుంది. బాధితుడికి అసలైన ఐఫోన్‌ 15 ప్లస్‌ను అందించలేకపోతే రూ.80 వేలు రీఫండ్‌ చేయాలి.

అదనంగా మానసిక వేదనకు పరిహారంగా రూ.25 వేలు చెల్లించాలి, అని ఫోరం తన తీర్పులో పేర్కొంది. ఫోరం ఇచ్చిన ఆదేశాలను అమెజాన్‌ సంస్థ అమలు చేయకపోవడంతో, కోర్టు కఠినంగా స్పందించింది. ఫోరం అమెజాన్‌ సంస్థ ప్రతినిధులపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి, ఆదేశాల అమలును నిర్ధారించమని స్పష్టం చేసింది.

తదుపరి విచారణ నవంబర్‌ 21కి

ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసినట్టు ఫోరం ప్రకటించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ఈ-కామర్స్‌ సంస్థలకు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేయకూడదన్న హెచ్చరికగా నిలుస్తోంది.

న్యాయవాదుల అభిప్రాయ ప్రకారం, ఆన్‌లైన్‌ వాణిజ్యంలో వినియోగదారుల హక్కులను రక్షించడంలో కన్జ్యూమర్‌ ఫోరమ్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఫోరమ్‌ ఆదేశాలను పాటించని సంస్థలు కూడా చట్టపరమైన చర్యలకు లోనవుతాయి,అని పేర్కొన్నారు.

ఈ ఘటనతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కంపెనీలు డెలివరీ పారదర్శకత, కస్టమర్‌ సపోర్ట్‌, మరియు ఫోరమ్‌ ఆదేశాల అమలు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Leave a Reply