చెక్ పోస్టుల రద్దు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ చెక్ పోస్టులను (Transport Check Posts) తక్షణమే మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (Deputy Transport Commissioners) అండ్ జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ వంటి వాటిని వెంటనే తొలగించాలి. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎటువంటి సిబ్బంది ఉండరాదని, వారిని ఇతర విభాగాలకు తిరిగి నియమించాలనే ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, పరికరాలను సంబంధిత జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలకు తరలించి, ఆర్థిక మరియు పరిపాలనా పత్రాలను భద్రపరచాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు జారీ చేయాలని కూడా ఆదేశించారు.

