మోసాన్ని పసిగట్టిన బీహెచ్ఈఎల్ విజిలెన్స్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు స్టేజ్-1(Thermal Project Stage-1) నిర్మాణం పనుల్లో 35 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చకు దారితీస్తుంది. 2017 -22 మధ్యకాలంలో జరిగిన నిర్మాణం పనుల వ్యవహారంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని బీహెచ్ఈఎల్ విజిలెన్స్(BHEL Vigilance) విభాగం పసిగట్టిన నేపథ్యంలో దుర్వినియోగం కథా కమామిషు అంతా కూడా సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చెంతకు చేరింది.
భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగిన అంశాన్ని సీబీఐ కేసులు నమోదు చేసిన వ్యవహారం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. తెలంగాణ స్టేజ్ 1 నిర్మాణం సమయంలో బీహెచ్ఇఎల్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయని… బీహెచ్ఈ ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ విజిలెన్స్ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు అధికారులపై సీబీఐ కేసులను నమోదు చేసి విచారణను ప్రారంభించిన అంశం అలజడిని రేకెత్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో తెలంగాణలో విద్యుత్ సమస్యలు అధిగమించేందుకు 4000 మెగావాట్ల ప్రాజెక్ట్ రామగుండంలో నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. అందులో భాగంగానే రామగుండం తెలంగాణ స్టేజ్ వన్ 1600 మెగావాట్ల పనుల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది.
ఈ నిర్మాణం పనుల్లో ప్రాజెక్ట్ బాయిలర్(Project Boiler) పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ నిర్మాణం పనులను బ్రిడ్జి అండ్ రూఫ్ కంపెనీ(Bridge and Roof Company) ఇండియా లిమిటెడ్, పవర్ ఇన్ఫ్రామెచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అప్పగించగా సదరు కంపెనీలు చేపట్టిన నిర్మాణం పనుల్లో సంస్థకు నష్టం జరిగిందని బీహెచ్ఇఎల్ కంపెనీ పసిగట్టి ఈ అంశాన్ని సంస్థ బీహెచ్ఈఎల్ విజిలెన్స్ విభాగానికి అప్పగించడంతో అప్పుడు జరిగిన క్షేత్రస్థాయి పరిశీలనలో సుమారుగా 35 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ చేసుకుంది.
ఇందులో మరో విషయం ఏంటంటే… సదరు సొంత సంస్థ బీహెచ్ఇఎల్ కంపెనీకి చెందిన అధికారులే ఇతర కంపెనీల అధికారులతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తమ క్షేత్రస్థాయి విచారణలో తేటతెల్లమైన నేపథ్యంలో బీహెచ్ఇఎల్” సంస్థ సీబీఐని ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా నిధుల దుర్వినియోగానికి బీహెచ్ఇఎల్ విజిలెన్స్ విభాగం జనరల్ మేనేజర్ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) హైదరాబాదులో సీబీఐకి ఫిర్యాదు చేయగా అక్టోబర్ 14న సీబీఐ పలువురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాన్ని సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం దుర్వినియోగానికి అసలు సూత్రధారులు ఎవరనేది బహిర్గతం కానుంది.