దీపం వెలగదు.. ధూపం లేదు

దీపం వెలగదు.. ధూపం లేదు

నైవేథ్యం అంతంతే
ఇదీ పెనుమూరు కోదండ రామయ్య ధీనస్థితి

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : ఒకరి భూమిని మరొకరు కబ్జా చేస్తే కోర్టును ఆశ్రయిస్తారు. ఏ దిక్కూ లేకపోతే దేవుడే దిక్కు అనుకుంటారు. అయితే చిన్న చేప‌ను పెద్ద చేప మింగినట్లు చిన్న దేవుని మాన్యం పెద్ద దేవుడు ఆక్రమించుకుంటే ఎవరికి చెప్పాలి.. అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. అది కూడా స్థానిక నేతే టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఇలా జరుగుతోందని భక్త జనం వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో పురాతన‌ కోదండ రామాలయం ఉంది. ఆలయానికి చుట్టు పక్కల గ్రామాల్లో వంద ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. పెనుమూరు బస్టాండ్ వద్ద 1.15 ఎకరాల ఖరీదైన భూమి ఉంది. ఇందులో కొంత భాగాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలను నిర్మించారు. కొంత స్థలంలో టీటీడీ అధికారులు ఆధునిక హంగులతో కల్యాణ‌ మండపం నిర్మిస్తున్నారు. ఎవరు కూడా కోదండరామ స్వామికి అద్దెలు చెల్లించటం లేదు. ఆలయంలో రామయ్య సకుటుంబ సమేతానికి నిత్యపూజలు కూడా జరగడం లేదు. భారీగా ఆస్తులు ఉండటంతో.. సర్కారీ నిత్య దూప నైవేద్యం పథ‌కం కూడా పాపం రాములోరికి వర్తించలేదు.

పెనుమూరు బస్టాండు ఎదురుగా సర్వే నంబర్ 502లో 50 కోట్ల విలువ గల 1.15 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఒక్క అడుగు స్థలం రూ.15000 ధర పలుకుతోంది. ఇందులో 15 సెంట్ల భూమిలో పలుకుబడి కల కొందరు 40 ఏళ్ల క్రితం షాపులు కట్టుకున్నారు. మొదటిలో నెలకు కొంత మొత్తం ఆలయానికి ఇచ్చేవారు. రాను రాను పట్టించుకోవడం మానేశారు. రిజిస్ట్రార్ ఆఫీసులో అధికారులను ప్రలోభ పరచి క్రయ విక్రయాలు జరుపుతున్నారు. రెండేళ్ల కిందట వైసీపీ పాలనలో మిగిలిన ఎకరం స్థలాన్ని టీటీడీ వారు స్వాధీనం చేసుకుని అందులో కల్యాణ‌ మండపం కడుతున్నారు. గ్రామస్తులు అడ్డు పడినప్పటికీ అప్పటి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి దగ్గర ఉండి, పోలీసుల రక్షణలో పునాదులు వేశారు.రూ. 40 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు కనీసం నాలుగు రూపాయలు కూడా కోదండ రామునికి ఇవ్వలేదు.

ప్రస్తుతం కోదండ రాముని గుడిలో దీపం పెట్టే దిక్కు కూడా లేదు. గతంలో ఒక పూజారి రోజూ దీపం పెట్టే వారు. ఇప్పుడు వారానికి ఒక సారి దీపంతో నైవేథ్యం పెడుతున్నారు. దీని దుస్థితిని మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు, రాష్ట్ర నాయ‌కుడు లోకనాథ‌ నాయుడు, జిల్లా నాయకుడు తలారి రెడ్డప్ప రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనితో ఆయన విచారణకు ఆదేశించారు. కాగా రైతుల ఆక్రమణలో ఉన్న భూములను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి, స్థానిక నేతలు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాశ్ నాయుడు పలు సార్లు అధికారులకు విజ్ఞప్తులు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు.

పెనుమూరు మండలానికి చెందిన బి ఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన అయినా స్పందించి కోదండ రాముని కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని కలికిరి కొండను స్వాధీనం చేసుకున్న రీతిలోనే రామాలయాన్ని కూడా టీటీడీ స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోదండ రామాలయానికి పూర్వ వైభవం తీసుకుని రావడానికి కృషి చేస్తానని గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు.

Leave a Reply