ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఒక హోటల్ లోని నిర్మాణంలో ఉన్న ఒక హోటల్‌లో వాటర్ ట్యాంకు కూలిపోవడంతో తల్లీకొడుకులు దుర్మరణం చెందిన సంఘటన ఈ రోజు తెల్లవారు జామున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామ సమీపాన జరిగింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి.
దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన డొంకిట్ ఫిల్టర్ కాఫీ హోటల్ భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో మాడుగులపల్లి మండలానికి చెందిన నాగమణి (27), ఆమె కుమారుడు వంశీకృష్ణ (5) లు మృతి చెందారు. అలాగే హోటల్ యజమాని తల్లీ, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు నార్కెట్ పల్లి లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డొంకిట్ ఫిల్టర్ కాఫీ హోటల్ ఆదివారం ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. హోటల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్న తొందర లో యజమాని రాత్రి వేళల్లో హడావిడిగా నిర్మాణం పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్ నిర్మాణం కూడా కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజే హోటల్ ప్రారంభోత్సవం ఉండడంతో యజమాని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సిబ్బంది హోటల్లోనే పడుకున్నారు. ఇంత లోనే ఈ దుర్ఘటన సంభవించడంతో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.