నెక్కొండలో మృతి… ఒడిషాలో ఎఫ్ ఐ ఆర్
మృతదేహన్ని ఆలా తరలించవచ్చా..?
- స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచార లోపం.
- ఒరిస్సాలో కేసు నమోదు అయ్యాక సమాచారం…
- నాలుగు లక్షల కోసమే అని ఎస్సై వివరణ.
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : జిల్లాలోని నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఓ క్వారీలో అక్టోబర్ 11న ఒడిషాకి చెందిన ఓ కూలి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సదరు మృతదేహాన్ని మహబూబాబాద్ కు తరలించి అక్కడి నుండి ఒడిషాకి తరలించి, చిత్రకొండ అనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి, పోస్టుమార్టం నిర్వహించి తదనంతరం కార్యక్రమాలు నిర్వహించారు.
సాధారణంగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కానీ, సహజంగా కానీ మృతి చెందితే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, విచారణ అనంతరం పోస్ట్ మార్టం కి తరలిస్తారు. ఏది ఏమైనా స్థానిక పోలీస్ స్టేషన్ లో మాత్రం తప్పకుండా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ రెడ్లవాడ క్వారీలో మాత్రం ఆలా జరగలేదు.ఉదాహరణకు అదే క్వారీలో హత్య జరిగినా, ఇలా మృతదేహన్ని రాష్ట్రాలు దాటిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఒక మృతదేహన్ని ఎటువంటి పంచనామా లేకుండా రాష్ట్రం సరిహద్దులు దాటించగలిగారంటే మన జిల్లాలో రక్షణ వ్యవస్థ ఎలా పని చేస్తుందో చెప్పవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో ఉన్నవారికి, క్వారీ నడుపుతున్న వారికీ నియమ నిబంధనలు తెలియక పోవడం కారణంగానా, లేక, క్వారీలో జరిగే ప్రమాదాలు, వాటి కారణంగా సంభవించే కూలీల మరణాలను బహిరంగ పర్చకుండా క్వారీ యాజమాన్యంతో నుంచి పోలీసులకు సన్నిహిత సంబంధాలు, పరిచయాలు కలిగి ఉండడం వల్లనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగు లక్షల కోసమే -ఎస్సై మహేందర్
రెడ్లవాడ క్వారీ ఘటన పై నెక్కొండ ఎస్సై మహేందర్ వివరణ కోరగా ఘటన 11వ తారీకు జరిగిందని 13 వ తారీకున వారికి తెలిసిందని ఒడిషాలోని చిత్రకొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదయిందని అక్కడి ఎస్సై ప్రశాంత్ తో మాట్లాడినట్లు తెలిపారు. అక్కడి స్థానిక కూలీల మరణం ప్రమాదవశాత్తు సంభవిస్తే ప్రభుత్వం నుండి వచ్చే నాలుగు లక్షల కోసమే ఇలా చేసినట్లు వారు తెలిపారన్నారు.
అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ను సైతం నెక్కొండ స్టేషన్ కు బదిలీ చేసినట్లు, 30మందిని విచారణ చేస్తున్నట్లు వారు తెలిపారు.