అతి తక్కువ టారిఫ్‌తో అందుబాటులోకి 4జీ సేవలు
రోజు రోజుకూ పెరుగుతున్న సబ్ స్క్రైబర్‌లు
ఇతర నెట్‌వర్క్‌లో ఉన్న వారంతా ఘర్ వాపసీ
ప్రస్తుతం తొమ్మిది కోట్ల మంది కస్టమర్లు
ఎయిర్ టెల్, జియోకు షాక్ ఇస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ₹262 కోట్ల లాభం
విస్తరణకు ₹6 వేల కోట్లను కేటాయించిన కేంద్రం
కొత్త టవర్ల ఏర్పాటుతో యూజర్లకు మెరుగైన సేవలు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ: భారతీయ టెలికాం మార్కెట్లో పెద్ద మార్పులకు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ పునాది వేస్తోంది. భారత టెలికాం రంగంలో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ పెద్ద ఆటగాడిగా తన ప్రయాణాన్ని చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. వాస్తవానికి గత ఏడాది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికా మర్చంట్ వివాహం తర్వాత జియో నెట్‌వర్క్ విపరీతంగా పెంచిన టారిఫ్స్ యూజర్లలో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో యూజర్లు ఘర్ వాపసీ అంటూ బీఎస్ఎన్ఎల్‌కి తిరిగి రావాలని పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ టాటా సహకారంతో దేశవ్యాప్తంగా 4జీ, 5జీ లాంచ్ కోసం అవసరమైన టవర్స్, టెక్నాలజీని నిర్మించుకోవటం యూజర్లలో నమ్మకాన్ని పెంచింది. పైగా తాము టారిఫ్స్ పెంచే ఉద్ధోశ్యంలో లేమని కూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. జియో, ఎయిర్ టెల్ కంటే 50 శాతం టారిఫ్‌తోనే 4జీ సేవలను అందుబాటులోకి తేవడం కూడా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
కేంద్రం చేయూతతో లాభాల బాటలోకి..
కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణ కోసం మరో ₹6,000 కోట్లను కేటాయించింది. ఈ క్రమంలోనే కంపెనీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ₹262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఒకపక్క వొడఫోన్ ఐడియా భారీ నష్టాల్లో కొనసాగుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ మాత్రం లాభాల బాట పట్టడం శుభపరిణామంగా యూజర్లు భావిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ లాభాలకు దారితీసిన పరిణామాలను గమనిస్తే నిరంతరం బీఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరిస్తూ, కస్టమర్ బేస్ పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలతవంతంగా మారాయి. సేవల్లో కొనసాగుతున్న మెరుగుదలను ఇది సూచిస్తోంది. డిసెంబర్‌లో కస్టమర్ల సంఖ్య కూడా దాదాపు 9 కోట్లకు పెరిగింది.
వేగవంతమైన కనెక్టివిటీ..
ఇదే క్రమంలో మొబైల్, ఫైబర్ టు ది హోమ్, లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో 14-18 శాతం వృద్ధిని నమోదు చేయటం బీఎస్ఎన్ఎల్ బ్యాక్ టూ గెయిన్స్ కి దారితీసింది. కంపెనీ చివరి సారిగా లాభాలను 2017లో పొందింది. అయితే.. ప్రస్తుతం మూడో త్రైమాసికంలో ఫైబర్ టు ది హోమ్ ఆదాయం 18శాతం, లీజుకు తీసుకున్న లైన్ సర్వీస్ ఆదాయం 14శాతం పెరుగుదలను చూశాయి. ఇవి కంపెనీ నష్టాలను తగ్గించటంలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కంపెనీ ప్రస్తుతం లక్ష టవర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 75 వేల టవర్లను కంపెనీ ఇన్స్టాల్ చేసింది. వీటిలో 65వేల టవర్లు సేవలను అందించటం ప్రారంభించాయి. మిగిన టవర్ల ఏర్పాటు త్వరలో పూర్తి చేసి జూన్ 2025 నాటికి వాటిని సేవల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.