హాట్ టాఫిక్ గా ఓరుగల్లు పాలిటిక్స్..
- కాంగ్రెస్ లో కొండా కపుల్స్ కొనసాగేనా..!?
- సీఎంపై డాటర్ కామెంట్స్ తో తెగిన సత్సంబంధాలు
- అమాత్య పదవి కొండాకు అచ్చిరాదా..!
- భవిష్యత్తుపై మల్లగుల్లాలు
- పరిస్థితులు చక్కబడేనా… బెడిసికొట్టేనా..
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : రాజకీయ రణక్షేత్రంలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రాజకీయ భవితవ్యమెంటన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇపుడు రాష్ట్ర రాజకీయాలు కొండా ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి. కొండా కూతురు సుస్మిత పటేల్ చేసిన హాట్ కామెంట్స్ అధికార కాంగ్రెస్ పార్టీని కుదుపేస్తోంది.
అదీగాక రాష్ట్ర ప్రభుత్వ పనితీరును బట్టబయలు చేయడంతో సర్కార్ ను సైతం ఇరకాటంలోకి నెట్టేసింది. కొండా డాటర్ ఇచ్చిన స్ట్రోక్ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది. అగ్రవర్ణ నేతలంతా కుమ్ముక్కై కొండా సురేఖను టార్గెట్ చేశారనే సుస్మిత పటేల్ ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ తీరుతో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటేక్కాయి.
కొండా రూటే… సఫరెట్
పోరాటాల పురటిగడ్డ ఓరుగల్లు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం మొదటి నుండి ప్రత్యేకమే. అందరి దారిలో కాకుండా భిన్నంగా వ్యవహరిస్తూ వివాదాస్పద నేతగానే కాగా ఫైర్ బ్రాండ్ గా మారారు.
సురేఖ పొలిటికల్ ఫైటర్ గా కూడా గుర్తింపు పొందారు. కానీ పదేళ్ళ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొండా కామెంట్స్ అన్నీ కంట్రీవర్సీగా మారాయి.
మంత్రి కొండా సురేఖ తీరు అటు పార్టీకి, ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. దాంతో కొండా కపుల్స్ వివాహదాస్పద నేతలుగా ముద్ర పడ్డారు.
కొండా ఫ్యామిలీ ఎవ్వరి తోను సత్సంబంధాలు,సఖ్యత కొనసాగించలేరనే అపవాదును మూటగట్టుకొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలతో గొడవలు, ప్రతిపక్షాల నేతలతో వివాదాలు, సహచర మంత్రులతో విభేదాలు. చివరకు ఇపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కూడా సఖ్యత కొనసాగించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
కానీ లేటెస్ట్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిపై కొండా కపుల్స్ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. బ్యాలెన్స్ గా ఉంటూనే వచ్చారు. కానీ కొండా కపుల్స్ కూతురు సుస్మిత పటేల్ చేసిన ఆరోపణలు వారి కుటుంబానికి అగ్ని పరీక్షగా మారాయి. కొండా దంపతులు నేరుగా కామెంట్స్ చేయకుండా కూతురుతో ఆరోపణలు చేయించి అటు పార్టీని, ఇటు సర్కార్ ను ఇరకాటంలో పడేశారు. అదీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు,స్థానిక సంస్థల ఎలెక్షన్ టైమ్ లో కొండా ఫ్యామిలీ సృష్టించిన రాజకీయ దుమారం కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం తెచ్చి పెడుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి.
కాంగ్రెస్ లో సుస్మిత కల్లోలం
మంత్రి కూతురు కొండా సుస్మిత తమ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.ప్రైవేట్ ఓఎస్ది సుమంత్ కోసం తమ రాజకీయ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్ పార్టీలో కాక రేపాయి.
రెడ్లంతా ఏకమై తనతల్లిని వేధిస్తున్నారని, తనతల్లికి ఏదైనాజరిగితే అందుకు రేవంత్ రెడ్డే బాధ్యతవహించాలని హెచ్చరించటం కూడా సంచలనంగా మారింది. బీసీ మహిళ అని కూడా చూడకుండా తన తల్లిని ఇంతలా రేవంత్ వేధిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
సుస్మిత ఎక్కడో ప్రైవేటుగా మాట్లడలేదు. నేరుగా మీడియాతోనే మాట్లాడటంతో అధికార పార్టీలో కలకలంరేపింది.
కొండా కెరీర్…
కొండాసురేఖ తన రాజకీయ ప్రస్ధానాన్ని 1995లో మొదలు పెట్టారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ లో 1964లో పుట్టిన సురేఖ, గీసుకొండ ఎంపీటీసీగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. అప్పుడే ఎంపిపిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత జడ్పటీసీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని జిల్లా స్థాయికి పెంచుకొన్నారు. 1996లో పీసీసీ సభ్యురాలయ్యారు. మొదటినుండి సురేఖ తనదైన శైలిలో స్పందిస్తూ తన గుర్తింపును పెంచుకొంటు వచ్చారు. స్వర్గీయ వైఎస్సార్ మద్దతుదారుగా నిలిచారు.
1999లో శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొండా సురేఖ పోటీచేసి గెలిచారు. ఎంఎల్ఏ హోదాలో మహిళా శిశుసంక్షేమశాఖ, ఆరోగ్య, ప్రాథమిక విద్యాకమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏఐసీసీ కో ఆప్షన్ సభ్యురాలిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.
2004లో రెండోసారి కూడా శాయంపేట నుండి గెలిచిన సురేఖ మూడోసారి 2009 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గానికి మారి గెలిచారు. అప్పుడు వైఎస్ క్యాబినెట్ లో మొదటిసారి మంత్రయ్యారు. వైఎస్ మరణం తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుపలికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
అవినీతి కేసుల్లో వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతో అప్పటి ప్రభుత్వ తీరును నిరాశిస్తూ తాను 2011, జూలై 4వ తేదీన ఎంఎల్ఏగా రాజీనామా చేశారు. 2012, జూన్ 12 జరిగిన ఉపఎన్నికలో తిరిగి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
పార్టీలో జరిగిన పరిణామాలతో జగన్ తో విభేదించి 2013లో జూలై 13న వైసీపీకి రాజీనామాచేసి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదించి 2018లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.
2018 ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సురేఖ మళ్ళీ 2023ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా వరంగల్ ఈస్ట్ నుండి పోటీచేసి గెలిచి ఇపుడు మంత్రిగా పనిచేస్తున్నారు.
నేతలతో కరువైన సఖ్యత
రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల సఖ్యత, సత్సంబంధాలు నెరపడంలో ఫెల్యూర్ అయ్యారు. ఏ ఎమ్మెల్యే మద్దతుగా నిలిచే పరిస్థితులు లేవు.వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ నాయిని రాజేంద్రరెడ్డి, పరకాల ఎంఎల్ఏ రేవూరి ప్రకాష్ రెడ్డి,ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, తదితర నేతలతో సురేఖకు విబేధాలు ఏర్పడ్డాయి.
సదరు నేతలపై కొండా కపుల్స్ చేసిన కామెంట్స్ తో వారంతా ఏకమయ్యారు. ఫలితంగా మంత్రి సురేఖ ఒంటరయ్యారు అదీగాక తరుచూ వ్యతిరేక గ్రూపుతో కీచులాటలు. ఒకరిపై మరొకరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర పంచాయితీలు జరిగినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది.చివరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన్నట్లుగా మారింది.
పనుల పంచాయితీ
ఓరుగల్లు ప్రజాప్రతినిధులతోనే పంచాయితి జరుగుతుండగానే తాజాగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గొడవలు మొదలయ్యాయి. మేడారం పనుల కాంట్రాక్ట్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు దక్కించుకోవడంతో పనుల పర్శంటేజీల పంచాయితీ మొదలైంది.ఈ వ్యవహారం రాజుకొని ఉండగానే మంత్రి ప్రైవేట్ ఓఎస్ది సుమంత్ పర్యవరణానికి భంగం కలిగిస్తున్న దక్కన్ సిమెంట్ ఇష్యూ లో సీఎం రేవంత్ రెడ్డి తీరునే వ్యతిరేకించడంతో వివాదం ముదిరింది.
ఈ విషయంపై ప్రైవేట్ ఓఎస్ది సుమంత్ ను సర్కార్ టెర్మినేట్ చేసింది.అంతేగాక సుమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొనే ప్రయత్నాలు చేయడం తో కొండా ఫ్యామిలీకి ఆగ్రహం కలిగించింది.ఇక కూతురు కొండా సుస్మిత పటేల్ స్క్రీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక సుస్మిత పటేల్ మీడియా ప్రతినిధులతో చేసిన హాట్ హాట్ కామెంట్స్ అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాశాయి.
ఇదే క్రమంలో మంత్రి కొండా సురేఖ క్యాబినెట్ మీటింగ్ గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,పార్టీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ లను కలసి తనకు ఎదురైన అవమానాలను ఏకరువు పెట్టుకున్నారు. వారే మొత్తం పరిస్థితిని చక్కదిద్దుతారని గంపెడాశలు పెట్టుకున్నారు. సీఎం పైనే కాక సీఎం సన్నిహితులు, సహచర మంత్రులపై డాటర్ చేసిన కామెంట్స్ దాడితో రాజేసిన అగ్గి రాజుకొంటుందా… సద్దుమణుగు తుందా అనే చర్చ మొదలైంది.
సీఎంపై కామెంట్స్ చేసిన తర్వాత వారి క్యాబినేట్లో కొండా సురేఖ కొనసాగుతారా…లేక రాజీనామా చేస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. లేదంటే ముఖ్యమంత్రే కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారా అనే శేష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ కొండా ఫ్యామిలీ ఇవేవీ ఆలోచించించకుండానే ఇంత రచ్చ చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండా కపుల్స్ తదుపరి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయనేదే విషయమే ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ లైఫ్ పై క్లారిటీగానే ఉన్నట్టే లీకులొస్తున్నాయి.ఇక ఎం జరుగుతుందో…వేచి చూడాల్సిందే… మరీ…

