లైమ్ లైట్ లోకి వెట‌ర‌న్ ప్లేయ‌ర్స్…

లైమ్ లైట్ లోకి వెట‌ర‌న్ ప్లేయ‌ర్స్…

  • ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా పయనం !
  • సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, భారత జట్టు వెంటనే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొనేందుకు టీమిండియా కెప్టెన్‌లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత బృందం బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుండి ఆస్ట్రేలియాకు పయనమైంది. ఈ పర్యటనలో వెటరన్ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

తరలివచ్చిన అభిమానులు..

ఆస్ట్రేలియా పర్యటనలో మొదటగా వన్డే సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్‌లో ప్రారంభమవుతుంది. ఈ సుదీర్ఘ టూర్‌కు జట్టుతో పాటు వెటరన్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఫ్లైట్ ఎక్కారు. ఈ క్ర‌మంలో విమానాశ్రయంలో కోహ్లీ, రోహిత్‌లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఫ్యాన్స్ వారిని చుట్టుముట్టి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కూడా అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకుని, ఓపికగా వారితో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వారి అభిమానాన్ని నిలబెట్టుకున్నారు.

కెప్టెన్, మాజీ కెప్టెన్ మధ్య సరదా సంభాషణ….

వన్డే కెప్టెన్సీ మార్పు జరిగిన తర్వాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటిసారి ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురుపడ్డారు. గిల్ పలకరించగానే, రోహిత్ వెంటనే “అరె గిల్.. ఎట్లున్నావ్ బ్రదర్” అంటూ చిరునవ్వుతో పలకరించాడు.

ఈ ఆప్యాయ పలకరింపుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కెప్టెన్, మాజీ కెప్టెన్ మధ్య ఉన్న చక్కని అనుబంధాన్ని చూపుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కోహ్లీ, రోహిత్‌లకు ఈ సిరీస్ కీలకం !!

ఐపీఎల్ 2025 తర్వాత దాదాపు నాలుగు నెలల విరామం తీసుకున్న కోహ్లీ, రోహిత్… ఈ సిరీస్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుండి వీడ్కోలు పలికిన వీరు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.

ముఖ్యంగా, 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్న కోహ్లీ, రోహిత్‌లకు ఈ మూడు వన్డేల సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో వారి ఆటతీరు ఆధారంగానే వారి భవిష్యత్తు నిర్ణయమవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అంచనాలను అందుకోలేకపోతే, వారంతట వారే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply