భారత్ తో వన్డే సిరీస్.. వారిపై డౌటే !!

టీమిండియా యువ సెన్సేషన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం భార‌త్ సిద్దమైంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుండి ప్రారంభం కానుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది.

కీలక ఆటగాళ్లు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ పెర్త్ లో జర‌గ‌నున్న‌ మొదటి ODI మ్యాచ్ అందుబాటులో లేరు. వారి స్థానంలో జట్టులోకి మ్యాథ్యూ కుహ్నెమన్, జోష్ ఫిలిప్ లను చేర్చారు. దాంతో పాటు యాషెస్ సిరీస్, షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ నేపథ్యంలో, వివిధ ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లను సమన్వయం చేయడం సెలెక్టర్లకు కష్టం అవుతోంది.

ఆడమ్ జంపా తన భార్యకు ప్రెగ్నెన్సీ లో ఉండ‌టంతో సెలవులో ఉన్నాడు. రెండో బిడ్డ పుట్టే సమయం దగ్గర పడటంతో, పెర్త్ నుండి త్వరగా ఇంటికి తిరిగి వెళ్లడం కష్టమని జంపా నిర్ణయించుకున్నాడు. అయితే అడిలైడ్, సిడ్నీ లో జరగనున్న తర్వాతి ODIలు, ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జంపా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

జోష్ ఇంగ్లిస్ కాలి కండరాల గాయం (calf strain) నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే తొలి రెండు ODIలకు దూరమయ్యాడు. అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్న మూడవ ODIకు ఇంగ్లిస్ సిద్ధంగా ఉండే అవకాశముందని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది.

ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన జోష్ ఫిలిప్ తొలిసారిగా ODIలో కీపింగ్ చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మ్యాథ్యూ కుహ్నెమన్‌ తొలి ODI కోసం జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతనికిది మొదటి ODI కానుంది. కుహ్నెమన్ గత మూడేళ్లుగా ఆస్ట్రేలియా జట్టుతో పలు పర్యటనలు చేసినప్పటికీ, చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. దేశీయ క్రికెట్‌లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ప‌లువురు ఆటగాళ్ల లభ్యతపై ఆందోళన..

ఆస్ట్రేలియా రెగ్యులర్ కీపర్ అలెక్స్ క్యారీ యాషెస్ సన్నాహాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఆ త‌రువాత భార‌త్ తో రెండో ODI నుంచి జట్టులోకి తిరిగి వస్తున్నాడు.
కేమరూన్ గ్రీన్ భార‌త్ తో జ‌రిగే మొదటి రెండు ODIలు ఆడుతున్నప్పటికీ, అక్టోబర్ 28న పెర్త్‌లో జరగ‌నున్న‌ మరో షీల్డ్ మ్యాచ్ కారణంగా మూడో ODIకు దూరమయ్యే అవకాశం ఉంది. షెఫీల్డ్ షీల్డ్, యాషెస్ సిరీస్, వ్యక్తిగత ఫిట్‌నెస్ పరిస్థితుల కారణంగా కొంద‌రు ఆటగాళ్ల లభ్యత ప్ర‌శ్నాత్మ‌కంగా మారింది.

భారత్‌తో మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా ODI జట్టు :

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కూపర్ కనోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కేమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మ్యాథ్యూ కుహ్నెమన్‌, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మ్యాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Leave a Reply