గూగుల్ ఒప్పందంతో జనం హర్షం

  • ఎమ్మెల్యే అమిలినేని ఘనస్వాగతం
  • ఐటీ మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు

అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో : భారత ప్రభుత్వ సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లలో విశాఖలో 15 00 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే విద్యా, ఐటీ శాకా మంత్రివర్యులు నారా లోకేష్ కి గన్నవరం ఎయిర్ పోర్టులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది అమెరికా తర్వాత ప్రపంచంలో గూగుల్ నిర్మించబోయే అతి పెద్ద ఏఐ హబ్. వచ్చే 5 ఏళ్లల్లో విశాఖ ఏఐ హబ్ నిర్మాణానికి రూ.1,33,000 కోట్ల) పెట్టుబడి పెట్టబోతున్నామని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ ప్రకటించారు. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల నడుమ చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఈవో థామస్ కురియన్ మాట్లాడుతూ… విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో తాము ప్రారంభించే ఏఐ హబ్ ను… భవిష్యత్తులో మరిన్ని గిగావాట్లకు విస్తరిస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉన్న ఏఐ సెంటర్స్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటుంది.

భారతదేశంలో మేం నిర్మించే అతి పెద్ద ఏఐ కేంద్రం ఇదే. దీనిద్వారా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చేయబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సబ్‌ సీ కేబుల్ నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానిస్తాం. దీని టెక్నాలజీతో పాటుగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా అందించబోతున్నాం.

హబ్‌లో పూర్తి సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి. దీనిలో టెన్సర్స్ ప్రాసెసింగ్ యూనిట్లను వాడుతాం, ఇవి ఏఐ ప్రాసెసింగ్‌కు బలం చేకూరుస్తాయి. ఇవి రెండింతల పవర్-ఎఫిషియన్స్ తో పనిచేస్తాయి. స్థానికంగా డేటాను స్టోర్ చేసి సావరిన్ ఏఐ అవసరాలు తీర్చేలా ఏఐ హబ్ పనిచేస్తుంది. జెమిని, ఇంకా మా ఏఐ మోడళ్ళన్నింటితోపాటు యాప్ డెవలప్ మెంట్ కోసం అవసరమైన ఏఐ ప్లాట్ ఫామ్ లను హబ్ అందిస్తుంది.

దీనిద్వారా ఉద్యోగులు, వ్యాపారులు, యువత అందరి అవసరాలకు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తీసుకురాగలమని భావిస్తున్నాం. ఏఐ హబ్‌లోని ఏఐ టెక్నాలజీ ద్వారా మా గూగుల్ ఐకానిక్ కన్సూమర్ ప్రొడక్ట్స్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీ మెయిల్, యాడ్స్, ఇతర సేవలు భారతదేశం నుంచే ప్రపంచానికి అందించే అవకాశముంది. భారతదేశానికి ఉత్తమ ఏఐ టెక్నాలజీని అందించడమే మా లక్ష్యం. వివిధ కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని అందించడంతోపాటు ఇండియాలో నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడ యువతను ప్రపంచస్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం.

భారత రెగ్యులేటరీ అవసరాలను తీర్చేలా టాలెంట్‌ పైప్‌లైన్ రూపొందిస్తాం. ఈ హబ్ ద్వారా భారతదేశానికి మాత్రమే కాకుండా ఆసియాతోపాటు ఇతర ప్రపంచ దేశాలకు సేవలు అందించేందుకు కనెక్టివిటీ నెట్‌వర్క్ ఏర్పరచడమే మా లక్ష్యం. గూగుల్ చాలాకాలంగా భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్ లోని ఐదు కేంద్రాల్లో ప్రస్తుతం 14వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం మేం భారత్ లో గూగుల్ క్లౌడ్ సొల్యూషన్స్ సేవలు ప్రారంభించాం.

ఇప్పుడు న్యూఢిల్లీ, ముంబయిలలో ఈ సేవలను అందిస్తున్నాం. గూగుల్ డివైస్ లను భారత్‌లో తయారు చేస్తున్నాం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాకు సహకారం అందిస్తున్న అందిరికీ ధన్యవాదాలు. ఇది గూగుల్ కు ఎంతో విశిష్టమైన రోజు. గూగుల్ తరపున భారత్ ప్రజలకు, ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఒప్పందం 2047 వికసిత్ భారత్ లో మా భాగస్వామ్యంగా భావించాలని థామస్ కురియన్ పేర్కొన్నారు.

Leave a Reply