ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

కర్నూల్ సిటీ, ఆంధ్రప్రభ : జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పెద్దపాడు గ్రామంలోని దామోదరం సంజీవయ్య బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. విజయ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల పట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, భద్రతా లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అవగాహన అవసరమని తెలిపారు. బాలికల విద్య, వైద్యసేవలు, పోషణ, రక్షణ వంటి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం వెనుక ఉద్దేశం, బాలికల హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడమే అని తెలిపారు. ఈ ఏడాది నేనే అమ్మాయి – నేనే నడిపించే మార్పు అనే నినాదంతో కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతీ బాలిక తన ప్రతిభతో సమాజంలో మార్పుకు దారితీయగలదని ఆమె ప్రేరణాత్మకంగా చెప్పారు.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి టీ. శారద మాట్లాడుతూ, ఎవరైనా బాలలు లేదా బాలికలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా అత్యవసర నంబర్లు 100, 112 ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల భద్రతలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొడక్షన్ అధికారి పద్మ, శిశు గృహ మేనేజర్ మెహతాబ్ బేగం, చిల్డ్రన్ హోమ్ ఇన్‌చార్జ్ పి. విజయ, ఉమ, ఉమెన్ కానిస్టేబుల్, డిసిపియు సిబ్బంది నరసింహులు, నాగేశ్వరరావు, రంగమ్మ, చిల్డ్రన్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply