ఇదీ అగ్రి ఆఫీసర్ల వ్యూహం

ఇదీ అగ్రి ఆఫీసర్ల వ్యూహం
- సీడ్ డంపింగే డంపింగ్
- వీటిలో అసలేవీ..నకిలీలేవీ..
- రైతులకు కఠిన పరీక్ష
- ప్రకాశం జిల్లాలో మొక్కజొన్న విపత్తు
అర్ధవీడు (ప్రకాశం జిల్లా), ఆంధ్రప్రభ : కరెక్షన్ అండ్ ఎరర్ మెథడ్(Correction and Error Method) అనేది ఒక ప్రాథమిక ఆలోచన. దీని ఫలితం శాస్ర్తీయ నిర్ధారణకు దారి తీస్తుంది. భవిష్యత్ నష్టాన్ని ముందుగానే కట్టడి చేస్తుంది. ఇందుకు భిన్నంగా కలెక్షన్ అండ్ ఎర్నింగ్(Collection and Earning) మెథడ్ అని మరోటి వుంది. ఇది నమ్ముకున్న వారికి ద్రోహం చేస్తుంది. ఈ రెండిటిలో వ్యవసాయ శాఖ అనుసరిస్తున్న పద్దతి ఏదీ అంటే.. రెండవదే అని చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. రైతుకు అడుగడుగునా చేదోడుగా ఉండాల్సింది పోయి…ప్రయివేట్ కంపెనీల(Private Companies) పంచన చేరి పుడమి బిడ్డకు వంచన చేస్తుందా ! అని అనుమానించాల్సి వస్తోంది.
మండలంలో రబీ సీజన్ సింహ భాగం మొక్కజొన్నవిత్తనోత్పత్తి సాగవుతుంది. ఏటా రైతులు తీవ్రాతి తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇందుకు కారణమేంటో విశ్లేషించి రైతును జాగృతం చేయాల్సి వుంది. ఈ తరహా భాద్యత వ్యవసాయ శాఖ నిర్వహించినట్లు మచ్చుకైనా ఒక ఉదాహారణ కనిపించదు. కనీసం ఏ కంపెనీలు, ఏ రకం విత్తనం ఇస్తున్నాయి? ఐకార్(ICAR) ( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ) సూచనలు అమలు చేస్తున్నారా? ఒప్పంద వ్యవసాయ నిభందనలు పాటిస్తున్నాయా? జే డి ఏ(JDA) ల స్థాయి రాష్ట్ర సమావేశం విత్తన ఉత్పత్తి రైతుల రక్షణ కోసం చేసిన తీర్మానం అమలవ్వుతుందా? లేదా? వంటి కీలక అంశాలపై తమకు పట్టింపు లేదన్నట్లు వ్యవహారిస్తోంది.
కనీసం ఈ ప్రశ్నల తాలూకు ప్రాథమిక సమాచారం ఆ శాఖ వద్ద భూతద్ధం వేసి వెతికినా కనిపించదంటే ఏ మాత్రం అతిశయం కాదు. అంతగా ఆ శాఖ తన నిఘాను, నిబద్దతను, మేధస్సును, విజ్ఞతను పరాయికరించిందా? అని అనిపిస్తుంది. ఇందుకు గతాన్ని తవ్వాల్సిన పనే లేదు. తాజా వుదాహారనే ఆధారంగా చూపోచ్చు. వారం కిందటే అసలివో.. నకిలీవో శీర్షికన ఆంధ్ర ప్రభ కథనాన్ని ప్రచురించింది. మండలంలో దిగిన విత్తన డంపులు సరైనవో? కాదో? తెలిసేదెలా అంటూ ప్రశ్నించింది.
తేల్చాలని సూచించింది. తద్వారా గతంలో జరిగిన నష్టం పునరావృతం కారాదనీ ఆశించింది. దీనినే కరెక్షన్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. కానీ వ్యవసాయ శాఖ చేసిందేమిటి? ఆ విత్తనం అసలీదా? నకిలీదా? అని తేల్చడం సంగతి దేవుడెరుగు. కనీసం ఆ విత్తన డంపుల వైపు కన్నెత్తి కూడా చూడ లేదు. ఇప్పుడు అక్కడ డంపు లేదు. విత్తన సంచులు వాహనాల్లో గ్రామాలకు తరలాయి. ఒకటి రెండు గ్రామాల్లో విత్తడం పూర్తయింది. మొలకలు కూడా వచ్చాయి.
వ్యవసాయ శాఖ సహకారం లేకపోతే ఒక విత్తన గింజ అక్కడి నుండి కదిలే అవకాశమే లేదు. తరలి పోయాయి అంటే అర్ధం వ్యవసాయ శాఖ(Agriculture Department) కలెక్షన్ అండ్ ఎర్నింగ్ మెథడ్ అనుసరించిందని స్పష్టమవుతోంది. దీంతో విత్తన రైతు పుట్టి ముంచేందుకు వ్యవసాయ శాఖ మరోసారి తన పాత్రను తెలివిగా ప్రాథమిక దశలోనే పోషించిందని నిరంభ్యంతరంగా తేల్చి చెప్పొచ్చు.

