తెరపైకి ‘ప్లాన్‌-బీ’..!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఓ వైపు బీసీ రిజర్వేషన్ల అమలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెలువడిన షెడ్యూల్‌… ఈ రెండు అంశాలతో ముడిపెట్టుకుని ఉన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్రంఠభరిత వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో పరిస్థితులు అనుకూలించినా.. ప్రతికూలించినా.. అన్నింటికీ సిద్ధమేనంటూ అధికార పార్టీగా కాంగ్రెస్‌, ప్రజా ప్రభుత్వం గట్టి పట్టుదలతో అంతర్గతంగా సిద్ధం చేసుకున్న కార్యాచరణను బట్టి స్పష్టమవుతోంది.

ప్లాన్‌-ఏ ప్రకారం.. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేస్తూ పెంచిన 42శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లి మాట నిలబెట్టుకున్నామని ప్రజాక్షేత్రంలో ప్రకటించుకునే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వనరులను సంసిద్ధం చేసుకుంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల జీవోను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరిస్తే, అందుకు సైతం సంసిద్ధమైన రేవంత్‌ సర్కారు ప్రత్నామ్నాయ కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకుంది.

పరిస్థితులు ప్రతికూలిస్తే, తక్షణమే తెరపైకి ‘ప్లాన్‌-బీ’ తీసుకువచ్చి అమలుకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. ఆ దిశగా టీపీసీసీ సైతం కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకే ఈ రాజకీయ కార్యాచరణ అమలువుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

రాజ్యాంగ, న్యాయ నిపుణులు చెబుతున్న అంశాల ప్రకారం.. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం అందరూ అనుకున్నంత ఆశామాషీ వ్యవహారం కాదు. ఇందుకు సంబంధించి శాసనసభ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, అనంతరం ప్రభుత్వం జారీ చేసిన ఆర్ఢినెన్స్‌ గవర్నర్‌ వద్ద పరిశీలనలో ఉండగా, ప్రభుత్వం దూకుడు చర్యగా 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇవ్వడం చట్టపరంగా చెల్లుబాటు కాదు.

ఈ పరిణామాల క్రమంలో హైకోర్టులో కూడా ప్రభుత్వ నిర్ణయానికి ప్రతికూలమైన తీర్పే వస్తుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రజా ప్రభుత్వం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు ఆపొద్దన్న పట్టుదలతో సీఎం రేవంత్‌ అధికారిక చర్యలకు ఆదేశించారు. అదే సమయంలో స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా క్షేత్రస్థాయిలో వనరులన్నీ సంసిద్ధం చేసుకుంది.

జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న బలమైన ధీమా, గట్టి నమ్మకం ఇటు ప్రభుత్వ పెద్దల్లో, అటు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

ప్లాన్‌ బీ ప్రకారం… స్వల్ప మార్పులు

ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి అంతర్గత ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్లాన్‌-బీని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానాలు బీసీ రిజర్వేషన్లను 43 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తే, వెంటనే పాత పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం బీసీలకు 23శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సంసిద్ధమైంది.

ప్లాన్‌ బీ ప్రకారం ఎన్నికలు జరిగితే, ప్రభుత్వం ప్రకటించిన ఎంపీటీసీ, జడ్పీటీపీ, ఎంపీపీ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీసీలకు రిజర్వ్‌ అయిన స్థానాలు తగ్గి, అవి జనరల్‌ స్థానాలుగా మారనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, జనరల్‌, మహిళా రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. బీసీ రిజర్వ్‌ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు, రిజర్వేషన్లు మారినా ఆ స్థానం ఎలాగూ జనరల్‌ అవుతుంది కాబట్టి, పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇదీ.. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం..

ఒకవేళ కోర్టులు బీసీ రిజర్వేషన్ల పెంపును తిరస్కరిస్తే, కాంగ్రెస్‌ పార్టీ తమ వంతుగా బీసీ రిజర్వేషన్‌ పెంపునకు కట్టుబడి ఉన్నామని చాటుకోవడం కోసం పార్టీ పరంగా 42 శాతం టికెట్లు బీసీలకు కేటాయించాలని ఇతర పార్టీలను డిమాండ్‌ చేయాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఒక వేళ బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టులు అంగీకరించకపోతే పార్టీ పరంగా అవకాశం ఇవ్వాలన్నది పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇతర పార్టీలు కూడా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ క్షేత్రస్థాయి ప్రచారంలో డిమాండ్‌ చేయనుంది. తద్వారా బీసీల రిజర్వేషన్‌ పెంపుకు తాము కట్టుబడి ఉన్నామని చాటాలన్నది ఆ పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది.

రిజర్వేషన్లపై ఇప్పటివరకు జరిగిందిలా..

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టానికి సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అయితే, ఈ బిల్లుపై గవర్నర్‌ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, గవర్నర్లు తమ వద్దకు పంపిన బిల్లులపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే, ఆ బిల్లు ఆమోదం పొందినట్లు-గానే పరిగణించాలి. ప్రభుత్వం బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపి ఇప్పటికే 65 రోజులు అయ్యింది. మరో 25 రోజుల్లో సుప్రీంకోర్టు చెప్పిన గడువు ముగుస్తుంది.

హైకోర్టు జీవోను కొట్టివేసినా, అప్పటిలోగా గడువు పూర్తైతే చట్టం డీఫాల్ట్‌గా అమల్లోకి వచ్చి, ఎన్నికలకు వెళ్లడం సులభమవుతుందని ప్రభుత్వం ఈ ఆప్షన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న అంశంపై ఆశావహులతో పాటు ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొంది.

9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రచారం ప్రారంభించి ముందుకు వెళ్లాలా? లేక న్యాయస్థానం నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలా? అన్న అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా మంగళవారం రాత్రి పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు.

20 రోజులు ఆగితే, సుప్రీంకోర్టు గడువు పూర్తి..!

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టానికి సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ఆమోదించిగా.. గవర్నర్‌ వద్ద పెండింగ్‌ లో ఉంది. ఈ బిల్లుపై గవర్నర్‌ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ అంశాన్ని ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌ లో ఉన్న బిల్లుకు జీవో ఎలా తీసుకువస్తారని అడిగింది. అయితే.. గవర్నర్లు తమ వద్దకు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన బిల్లులపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

ఒక వేళ వారు ఈ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంచాయతీ రాజ్‌ బిల్లును పంపి ఇప్పటికే 70 రోజులు పూర్తయింది. మరో 20 రోజులు ఆగితే సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తి అవుతుంది.

అప్పటిలోగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోతే చట్టం డీఫాల్ట్‌ గా అమల్లోకి వస్తుందని.. అప్పుడు ఎన్నికలకు వెళ్లడం సులభం అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు జీవోను కొట్టేస్తే ఆ ఆప్షన్‌ ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply