కబ్జా రక్కసుల చెరలో…
- వంద ఎకరాల రామయ్య భూమి
- రూ. 28 కోట్లకు అధిపతి
- నిత్య దూపదీప నైవేధ్యాలకు దిక్కు లేదు
- అయ్యా మంత్రి రామ నారాయణ..శరణు శరణు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : త్రేతాయుగంలో.. రావణాసురుడు (ravanasurudu) సీతమ్మను కిడ్నాప్ చేస్తే.. వానర సైన్యంతో లంకపై దండెత్తిన రాములోరు.. ఈ కలియుగంలో వాడవాడలా కళ్ల ముందే భూరక్కసులు చెలరేగిపోతూ… పాపం రామయ్య ఆకలిదప్పులు తీర్చే భూముల్ని కొల్గగొట్టేస్తుంటే.. అన్నమో సీత, అన్నమో లక్ష్మణ అని దీనంగా రామయ్య (Ramaiah) మౌనంగా కంటతడి పెడుతున్నాడు.
ఔను.. ఒకటా రెండా ఏకంగా రూ.28 కోట్ల విలువ చేసే రాములోరి మాన్యాన్ని కౌలీశ్వరులు కబ్జా చేసేశారు. ఆ గుడిలో రామయ్య, సీతమ్మ, లక్ష్మయ్య, హనుమయ్యకు దూప, దీప, నైవేధ్యాల కరువుతో.. ధీనంగా భక్తులను చూస్తున్నారు. గుడి చిన్నబోతోంది. అభివృద్ధి కుంటుపడింది. రూ. 28 కోట్ల ఆసామి కోదండ రాముడు దిక్కులేని వాడయ్యాడు.
నిత్య పూజకు కూడా నోచుకోలేదు. ఆయన ఆలయ భూముల్ని రాజకీయులు హస్తగతం చేసుకున్నారు. పలుకుబడి పెత్తందారులు ఆదాయాన్ని ఆరగిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. ఆలయ భూములను కాపాడాల్చిన దేవాదాయ ధర్మదాయ అధికారులు నిమ్మకు నిరెత్తారు.
ఇటేవల కొందరు ఈ విషయమై రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి (Minister Ramanarayana Reddy) ని కలిసి ఫిర్యాదు చేశారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా ఈ విషయమై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దేవాదాయ ధర్మదాయ అధికారులు స్పందిస్తారని, ఆ భూములను అక్రమార్కుల చేర నుండి విడిపిస్తారని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కోదండరామయ్య (Kodandaramaiah) సపరివార కుటుంబ ఆకలికేకల కథ తెలుసుకుంది. మండల కేంద్రం పెనుమూరు గ్రామం శివారులో అల్లాల చెరువు కట్టను అనుకుని పూర్వీకులు కోదండరామాలయం నిర్మించారు. ఆలయ పోషణ కోసం వంద ఎకరాలకు పైగా భూములు సమకూర్చారు. ఆ భూములను రైతులకు కౌలుకిచ్చి సంవత్సరానికి కొంత సొమ్ము తీసుకునే వారు.
క్రమంగా ఆలయ నిర్వాహకుల అలసత్వం, కౌలు దారుల స్వార్థం వల్ల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములు కొందరు రాజకీయ పెత్తందారుల హస్తగతం అయ్యాయి. అమ్మగారి పల్లె సర్వే నెంబర్ 1 నుంచి సర్వే నెంబర్ 19 వరకు 116 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి విలువ ఎకరం రూ 20 లక్షల ప్రకారం రూ 13 కోట్ల 20 లక్షల విలువ ఉంటుంది. ఈ భూములను పూర్తిగా కౌలు బాబులు సొంతం చేసుకున్నారు. పెనుమూరు బస్టాండ్ ఎదురుగా సర్వే నెంబర్ 502లో ఒక ఎకరం 20 సెంట్ల భూమి ఉంది.
ఇందులో 15 సెంట్లు భూమిని ఆక్రమించి షాపులు కట్టుకున్నారు. ఇక్కడ ఒక అడుగు స్థలం రూ 15 వేలు ఉంటుంది. అంటే దాదాపు ఆ భూమి విలువ రూ.15 కోట్ల విలువ ఉంటుంది. మిగిలిన ఎకరం ఐదు సెంట్లు భూమిలో టీటీడీ కళ్యాణ మండపం (TTD Kalyana Mandapam) నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
రామాలయం ఆలనా పాలన మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. పెనుమూరులోని అక్కగార్లు (అక్క దేవతలు) భూమి అర్ధ ఎకరాన్ని మరికొందరు పెద్దలు ఆక్రమించారు. పెనుమూరు వినాయక స్వామి గుడి మాన్యం ఆరు ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు తెలిసింది. ఇందులో అట్లవాటి పల్లెలో ఆరున్నర ఎకరాలు, కేసీ పల్లె రోడ్డులో రెండు ఎకరాలు ఉంది.
స్వామి మాన్యం భూముల పరిరక్షణ కోసం గతంలో సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి (Mittapalli Satish Reddy), స్థానిక పెద్దలు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాష్ నాయుడు అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు. గత వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని టీడీపీ నాయకులు పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహక కార్యదర్శి లోకనాథ నాయుడు, పార్లమెంటు కార్యదర్శి రెడ్డప్ప కలసి కోదండ రామాలయ భూములు పరిరక్షించాలని కోరారు.