పాత ఎంఆర్పీ చెల్లదు

  • జీఎస్టీ కేంద్రం వరం
  • రైతులకూ లాభం
  • ప్రజలందరికీ ప్రమోజనం
  • కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి

ఆంధ్రప్రభ, కర్నూలు ప్రతినిధి : జీఎస్టీ పన్నులను కేంద్రప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని, ప్రజలు ప్రయోజనం పొందండి అని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి (Kurnool District Collector Dr. A. Siri) అన్నారు. బుధవారం భగత్ సింగ్ నగర్ లో జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి, జీఎస్టీ పన్నుల తగ్గింపు పై జిల్లా కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సీ క్యాంప్ రైతు బజార్ లో ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి వివరించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నిత్యావసర సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ (Packaged foods), ఆరోగ్య సంబంధిత సామాగ్రి, డెయిరీ, బేకరి ఉత్పత్తులు, స్టేషనరీ, బైక్, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు, తదితర వస్తువులకు గణనీయంగా జీఎస్టీ పన్నులు తగ్గాయని కలెక్టర్ ప్రజలకు కరపత్రాలు అందిస్తూ, అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను భగత్ సింగ్ నగర్ (Bhagat Singh Nagar) లో ఇంటింటికీ పంపిణీ చేసి, జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల లభించే ప్రయోజనాలను కలెక్టర్ ప్రజలకు వివరించారు.. నిత్యావసర సరుకుల మీద జీఎస్టీ పన్ను తగ్గించడంతో ప్రతి నెల కుటుంబానికి 1000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు.. షాపింగ్ కి వెళ్లినపుడు షాప్ నిర్వాహకులు వేస్తున్న ధరలను గమనించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

రైతు బజార్ (Rythu Bazar) లో దుకాణదారులతో మాట్లాడుతూ… పాత ధరలకు వస్తువులను పాత ఎమ్మార్పీ ధరలకు అమ్మకూడదని స్పష్టం చేశారు. అలా అమ్మితే ప్రజలు నిలదీయాలని కలెక్టర్ సూచించారు. జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి పాల్గొన్నారు..

Leave a Reply