మూలా నక్షత్రం రోజున ఎంతమంది భక్తులు వచ్చినా..

  • ఇబ్బంది లేకుండా చర్యలు..
  • రెండు లక్షల ఉచిత లడ్డూలు రెడీ
  • మంత్రుల బృందం, అధికారుల సమీక్ష…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన మూలానక్షత్రం రోజున భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు చేసిన ఏర్పాట్లపై మంత్రుల బృందం ఆదివారం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమావేశమై సమీక్ష నిర్వహించారు.

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో వీకే శీనా నాయక్.. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున తరలివచ్చే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై చర్చించారు.

సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి రాత్రి 11 గంటల నుంచి భక్తులను క్యూలైన్లో దర్శనం కోసం పంపే ఏర్పాటు చేశామని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని హోల్డింగ్ ఏరియాలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.

భక్తులు సహకరిస్తే అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం అమ్మవారిని 2 లక్షల పైచిలుకు భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. క్యూలైన్లు సజావుగా సాగేలా, అమ్మ దర్శన భాగ్యం త్వరితగతిన లభించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మంచినీటి బాటిల్లతో పాటు పాలు, బిస్కెట్లు వంటి వాటిని అదనంగా సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంతమంది వచ్చినా కోరినన్ని లడ్డూలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్ల సంఖ్యను పెంచడం జరిగిందని.. పారిశుద్ధ్య చర్యలకు అదనపు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో ఘాట్ల వద్ద తీసుకున్న చర్యలు పైనా చర్చించారు.

జల్లు స్నానాలు చేసేందుకు భక్తులకు కల్పించిన సౌకర్యాలను వివరించారు. రేపు భక్తుల రద్దీ దృష్ట్యా చిన్న చిన్న ఆంక్షలు పెడుతున్నామని .. ఆర్జిత సేవలకు వచ్చే వారు నిర్ణీత గడువు లోగా చేరుకోవాలని ఆలయానికి సంబంధించిన వాహనాల్లోనే కొండపైకి వచ్చేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. అందరికీ అమ్మ దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో ప్రణాళిక పనిచేస్తున్నామని చెప్పారు.

Leave a Reply