దుర్గమ్మ సన్నిధిలో ఏపీ గవర్నర్
( ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ) : ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పై కొలువైన కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు.

ఆలయ ప్రధాన ద్వారం నుంచి గవర్నర్ (Governor) కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్‌లాల్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహ ణాధికారి (ఈఓ) వి.కె.శీనా నాయక్ పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్‌ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ కనకదుర్గమ్మ (Kanakadurgamma) దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ కు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

గవర్నర్ పర్యటన అనంతరం, ఆలయ అధికారులు సిబ్బందితో ముఖ్య కార్యదర్శి హరి జవహర్‌లాల్ (Hari Jawaharlal) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వాకాబు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై వివరణ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఓ వి.కె. శీనా నాయక్ భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాల గురించి గవర్నర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పాల్గొన్నారు.


