పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు
చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్సై టి. శివ, పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.
పల్నాడు జిల్లా, యడ్లపాడు, సెప్టెంబర్ 23 ఆంధ్రప్రభ : చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు ఒక క్రూరమైన హత్య కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేసిన ఈ కేసులో నిందితులు పోలీసుల చాకచక్యంతో చిక్కారు.
ఈ కేసును ఛేదించిన పోలీసులను పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు.
ఘటన వివరాలు
యడ్లపాడు మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాలువలో కాలుతూ ఉందని జూన్ 25, 2025న ఉదయం సుమారు 9 గంటల సమయంలో యడ్లపాడు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా ఆ మృతదేహం తాడిబోయిన గోపి(32) అనే వ్యక్తిదని గుర్తించారు.
గోపి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడని, తరువాత సినిమా రంగంలోకి వచ్చి ‘సిలిస్టియాన్ క్రియేషన్స్’ అనే బ్యానర్‌తో షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు తీసేవాడని ‘మిషన్ మంగళాద్రి’ అనే వెబ్ సిరీస్ కూడా తీయడం మొదలుపెట్టాడని తెలిసింది.
గోపికి ఇమ్రాన్ అనే వ్యక్తి అక్క అఫ్రిన్ ద్వారా పరిచయం అయ్యాడు. అఫ్రిన్, గోపి సన్నిహితంగా ఉండేవారు. అలాగే, ఇమ్రాన్ ప్రేమిస్తున్న అమ్మాయి గురించి కూడా గోపి వేధించడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంతో గోపిని చంపి అతని డబ్బును కాజేయాలని ఇమ్రాన్ పథకం పన్నాడు. ఇందుకు తన స్నేహితులైన షేక్ రియాజ్, ఖాజా మొహిద్దిన్‌ల సహాయం కోరాడు.
హత్య ప్లాన్
జూన్ 24, 2025న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో గోపిని గుంటూరులోని ఇమ్రాన్ అద్దె గదికి రమ్మని ఫోన్ చేసి పిలిపించారు. అక్కడ ప్లాన్ ప్రకారం ముగ్గురూ కలిసి గోపి తలపై రాడ్‌తో కొట్టారు. ఆ తరువాత మెడకు తాడు బిగించి గొంతు నులిమి చంపేశారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారు కవరు, ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి తాడుతో కట్టి, గోపి కారు డిక్కీలో వేసుకుని చిలకలూరిపేటకు వచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొని, గుంటూరు వైపు వెళ్లే మార్గంలో యడ్లపాడు వద్ద నిర్మానుష్యంగా ఉన్న సర్వీసు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ కాలువలో గోపి మృతదేహాన్ని వేసి నిప్పంటించారు.
నిందితుల అరెస్ట్ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా, పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సుబ్బానాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ముగ్గురు నిందితులను ఎడ్లపాడు మండలం, ఎన్ఎస్ఎల్ టెక్స్‌టైల్స్ వద్ద సెప్టెంబర్ 22, 2025 సాయంత్రం 6.45 గంటలకు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్, గోపికి చెందిన వివో ఫోన్, ఏటీఎం కార్డులు, రూ.12,000 నగదు, అలాగే నిందితులు ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడుతో పాటు కేసు దర్యాప్తులో సహకరించిన ఎస్సై టి.శివ రామకృష్ణ, ఏఎస్సై సుబ్బారావు, ఏఎస్సై రోసిబాబు, హెచ్‌సీ శ్రీధర్, హెచ్‌సీ దేవరాజ్, పీసీలు ఇర్మియ, రాజేష్, రత్న కిషోర్, హెచ్‌జీలు సాంబ, మధుబాబు అలాగే సీడీఆర్ వింగ్ పీసీ వి. శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ అభినందించారు