నీట్ విద్యార్థులకు శాపంగా జీవో నెంబర్ 33

జీవోకు ముందు అర్హత ఉన్నా సరే రిజెక్ట్‌
విద్యార్థులకు ఆశని పాతంలా మారిన లోకల్, నాన్ లోకల్ సమస్య
తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు
తక్షణమే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

అశ్వ‌రావుపేట‌, ఆంధ్ర‌ప్ర‌భ : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో నిబంధనలు ( జీవో) విడుదలైనప్పుడు జీవో విడుదల అయినప్పటి నుంచి ఆయా శాఖలలో నిబంధనలు వర్తిస్తాయి. కానీ కొంతమంది ఉన్నతాధికారుల బాధ్యత రాహిత్యం నిర్లక్ష్య ధోరణి మూలంగా వెసులుబాటు ఉన్నా సరే బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులను ఉన్నత విద్యకు నిరాకరిస్తున్న వైనంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాజాగా జరిగిన నీట్ ఎంట్రన్స్ (NEET Entrance)లో మెరుగైన ర్యాంకు సాధించినప్పటికీ పలువురు విద్యార్థులు లోకల్ నాన్ లోకల్ సమస్యతో కౌన్సెలింగ్ (Counseling)కు అనర్హులు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) 2024 జూలై 17న జీవో నెంబర్ 33 (GO No. 33)ని విడుదల చేసింది. జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం విద్యార్థులు (Students) 9, 10 తరగతులు, ఇంటర్ విద్య కలిపి నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యనభ్యసిస్తే ఆ ప్రాంతం విద్యార్థులకు లోకల్ గా పరిగణించబడుతుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని మహబూబాద్ ప్రాంతానికి చెందిన ఊకే వశిష్ట అక్షయ్ పదవ తరగతి వరకు తెలంగాణలోనే విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ విద్యను మెరుగైన విద్యా ప్రమాణాల కోసం ఆంధ్రా(Andhra)లో పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం జీవోను 2024 జూలైలో విడుదల చేస్తే అదే ఏడాది మార్చి కల్లా అక్షయ్ ఇంటర్ (Inter) పూర్తి చేశాడు. కాబట్టి నూటికి నూరు శాతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అక్షయ్‌కు వర్తించదు కాబట్టి అతను తెలంగాణలో లోకల్ అభ్యర్థి కింద పరిగణించబడతాడు. ఈ క్రమంలో అక్షయ్ ఎంబిబిఎస్ (MBBS) చదవడానికి గాను నీట్ ఎంట్రెన్స్ రాయగా అతనికి 720 మార్కులకు గాను 405 మార్కులు వచ్చాయి. ఎస్టీ కేటగిరీలో అక్షయ్ కు 3012వ ర్యాంకు సాధించాడు. నీట్ లో మెరుగైన ర్యాంకు వచ్చింది తనకు ఎంబీబీఎస్ సీటు కన్ఫర్మ్ అని ఆనందపడేలోపే కౌన్సెలింగ్‌లో లోకల్ నాన్ లోకల్ సమస్య తలెత్తి ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ నిరాకరించటంతో అక్షయ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు.

అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులైన అతని తల్లిదండ్రులు ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు మునుపే తమ కుమారుడు విద్యాభ్యాసం పూర్తి చేసినా సరే లేనిపోని సాకులను అడ్డంగా చూపి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ (Registration)లో తిరస్కరణ చేయడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వందలాది మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తక్షణమే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకొని నీట్ కౌన్సిలింగ్ విషయంలో లోకల్ నాన్ లోకల్ సమస్యపై తప్పనిసరిగా సడలింపు ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply