అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారి క‌ల్యాణోత్స‌వం శుక్ర‌వారం క‌నుల‌పండువ‌గా నిర్వ‌హించారు. పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారికి పట్టు వస్త్రాలు ధరింపజేసి, సువర్ణభరిత వజ్రాభరణాలతో, సుగంధ భరిత పుష్పమాలలతో స్వామివారి అలంకరించారు. అనంత‌రం శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా విశిష్ట కల్యాణ మహోత్సవం జ‌రిగింది. శుక్రవారం ప్రాతః కాలంలో సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి (Mahalakshmi) అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.

వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుంచి తీసుకువచ్చారు. స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణం కోసం అర్చక స్వాములు సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3 వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వర్ణగిరి (Swarnagiri) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Leave a Reply