డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిలింస్ పై రూపొందిన కొత్త లోక : చాప్టర్ 1 – చంద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 28న గ్లోబల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తక్కువ కాలంలోనే రికార్డులను తిరగరాస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది.
ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ ‘చంద్ర’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేరళ జానపద కథల్లో కనిపించే యక్షిణి రూపంలో ఆమె పాత్ర అద్భుత శక్తులతో రూపుదిద్దుకుంది. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటూనే, సామాజిక అన్యాయాలపై పోరాడే ఆమె ప్రయాణం, ఒక పోలీస్ అధికారి చేత పీడింపబడే నేపథ్యంలో నడుస్తుంది. ఈ కథ, ప్రతిష్టాత్మకమైన లోకా సినిమాటిక్ యూనివర్స్ (LCU)కు మొదటి అధ్యాయం కావడం విశేషం.
నస్లెన్, శాండి, అరుణ్ కురియన్, విజయరాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ డబ్ వెర్షన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సెప్టెంబర్ 9 నాటికి, కొత్త లోక : చాప్టర్ 1 – చంద్ర ప్రపంచవ్యాప్తంగా రూ. 202.1 కోట్లు వసూలు చేసి, L2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్ , తుదరుం సినిమాల తరువాత అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే రూ.250 కోట్ల మార్కును దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా..
దక్షిణ భారతంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన ఫిమేల్-లెడ్ మూవీగా ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. మలయాళ సినీ చరిత్రలో తొలిసారిగా మహిళా ప్రధాన సూపర్ హీరోగా రూపొందిన చిత్రం కావడం విశేషం.
సూపర్ హీరో యాక్షన్, సామాజిక అంశాల మేళవింపుతో కొత్త లోక : చాప్టర్ 1 – చంద్ర ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంటోంది. రాబోయే లోకహ్ సినిమాటిక్ యూనివర్స్ కు బలమైన పునాది వేస్తూ, ఫీమేల్ సెంట్రిక్ కథలు కూడా ఎంతటి విజయాన్ని సాధించగలవో మరోసారి నిరూపించింది.

