ఫార్ములా ఈ-రేసు కేసు..

హైదరాబాద్‌ : ఫార్ములా ఈ-రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ పూర్తి చేసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (A1), సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (A3) నిందితులుగా ఉన్నారు.

కాగా, స‌మ‌గ్ర విచార‌ణ త‌రువాత రిపోర్ట్ రెడీ చేసిన ఏసీబీ… నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం వద్ద ఏసీబీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ప్ర‌భుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ముగ్గురిపై కూడా ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు.

ఇదీ కేసు …

ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌ (FEO) సంస్థకు అక్రమ లాభాలు చేకూర్చేందుకు మాజీ మంత్రి కెటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీ.ఎల్‌.ఎన్. రెడ్డి కలిసి కుట్ర పన్నారని, నిబంధనలను ఉల్లంఘించి రూ.54.88 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. ఈ ముగ్గిర‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో రామారావు ఏ1, అరవింద్ కుమార్ ఏ2, బీ.ఎల్.ఎన్. రెడ్డి ఏ3గా చేర్చింది.

ఫార్ములా ఈ–రేసు నిర్వహణ కోసం HMDA, FEO మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ, కేటీఆర్, అరవింద్‌కుమార్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేశార‌ని. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా చెల్లింపులు జరిగాయ‌ని… రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండానే HMDA–FEO మధ్య ఒప్పందం కుదిరిందని ఏసీబీ తెలిపింది.

మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి రెండు విడతల్లో రూ.45.19 కోట్లు నేరుగా UKలోని FEO ఖాతాకు బదిలీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ లావాదేవీలు విదేశీ కరెన్సీ మార్పిడి నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఈ కుంభకోణంలో నిధుల బదిలీ, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలపై.. దాదాపు తొమ్మిది నెలల పాటు ఏసీబీ దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసింది. నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అనుమతి లభించిన వెంటనే ముగ్గురిపైనా ఛార్జిషీటు దాఖలు చేయనుంది.

Leave a Reply