ఆ శ్రీనివాస కళ్యాణంపై విజిలెన్స్ విచారణ : టీటీడీ

తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో (రాయలసీమ) : రెండురోజుల క్రితం యునైటెడ్ కింగ్ డమ్ (United Kingdom) (యు కె) దేశంలో ఒక ప్రైవేటు సంస్థ తమ పేరు వినియోగించి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంపై సమగ్ర విచారణకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (Tirumala Tirupati Devasthanams) (టీటీడీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ ఈ నెల 6వ తేదీన యు కె లోని స్లాఫ్ ఎస్ ఎల్ 13 ఎల్ డబ్ల్యూ వద్ద నున్న సింగ్ సభ స్లాఫ్ స్పోర్ట్స్ సెంటర్ లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రిక వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అయింది.

ఆ శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. టీటీడీ కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినప్పటికీ ఆహ్వాన పత్రికలో టీటీడీకి చెందిన లోగోను వాడారు. అంతేకాక ఆహ్వాన పత్రిక (invitation letter) లో ఉచితం అని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. ఆ ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా, భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (566 పౌండ్లు) వసూలు చేస్తున్నట్లు సమాచారం కనిపించింది. డబ్బులు వసూలు చేసే అంశంతో పాటు టిటిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి.

సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖ (Vigilance Department for action) ను టిటిడి ఆదేశించింది. టీటీడీ పేరు వాడుకుంటూ ఇటువంటి కల్యాణాలను నిర్వహించడం భక్తులను మోసం చేయడమేనని టీ టీ డీ పేర్కొంటోంది. ఆ కల్యాణ నిర్వహణకు సంబందించి సమగ్ర విచారణ చేయాలని విజిలెన్స్ విభాగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టీ. రవి ప్రకటించారు. భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది. టిటిడి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టిటిడి పేరుతో శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు (Strict measures) తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బులు కోరితే టిటిడి విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.

Leave a Reply