- రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని, ప్రస్తుతం పాలన గాడిలో పడుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Dr. Ponguru Narayana) అన్నారు. ఈ రోజు డోన్‌లో పర్యటించిన ఆయన డంపింగ్ యార్డులో లెగసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు. చెత్త తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
చెత్త పన్ను పేరుతో ప్రజలను పీడించిన గత ప్రభుత్వం రూ.85 లక్షల టన్నుల చెత్తను మాత్రం వదిలేసి వెళ్లిందని మంత్రి అన్నారు. వైసీపీ అవకతవకలన్నీ తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని చెప్పారు. వారు వదిలి వెళ్లిన చెత్తను క్రమపద్ధతిలో తాము తొలగిస్తున్నామని, అక్టోబర్-2 గాంధీ జయంతి నాటికి ఈ చెత్తనంతా పూర్తి స్థాయిలో తొలగించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తమను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో రీసైక్లింగ్ పనులు (Recycling tasks) శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.79లక్షల టన్నుల చెత్తను తొలగించామని, ఇంకా ఆరులక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని వివరించారు. అక్టోబర్ రెండుకల్లా వంద శాతం క్లియర్ చేస్తామని చెప్పారు.
ఒక్క డోన్ లోనే 50 వేల టన్నుల చెత్తకు గాను 36 వేల టన్నులు తొలగించామని మంత్రి నారాయణ చెప్పారు. అమెరికా, చైనా, రష్యా, జపాన్, సింగపూర్ (America, China, Russia, Japan, Singapore) వంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. 2014 లోనే తమ ప్రభుత్వం పది ప్లాంట్లను మంజూరు చేసిందని, విశాఖ, గుంటూరు లో ఆ ప్లాంట్లు పూర్తయ్యాయని, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మిగిలిన 8 ప్లాంట్లను నిలిపివేసిందన్నారు. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక మరో ఆరు ప్లాంట్లు మంజూరు చేసిందని, వాటిలో నాలుగు ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
రాష్ట్రంలో డంపింగ్ యార్డులే లేకుండా చేయాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu) ఆలోచన అని మంత్రి వివరించారు. చెత్త రహిత రాష్ట్రంగా ఏపీని రోల్ మోడల్ గా నిలుపుతామని పేర్కొన్నారు. ఓవైపు పది లక్షల కోట్ల అప్పు కడుతూ మరోవైపు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఉన్నత ఉద్దేశంతో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వచ్చే మార్చి నాటికి టిడ్కో ఇళ్ళ సమస్య (Tidco housing problem) ను కూడా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, ఆర్డీవో కేపీ నరసింహులు, ఎమ్మార్వో రవికుమార్, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

