డోన్ బీసీ హాస్టల్ విద్యార్థి మృతి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyal) జిల్లా డోన్ పట్టణం శ్రీరామ నగర్ బీసీ హాస్టల్ (BC hostel) విద్యార్థి శ్యామ్ సుందర్ ఉరివేసుకుని మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్యామ్ సుందర్ (15) డోన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
అనంతపురం జిల్లా (Anantapur District) యాడికి పట్టణానికి చెందిన శ్యాంసుందర్ మీలాడి ఉన్ నబి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హాస్టల్ కు తిరిగి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్న విద్యార్థి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు బాత్రూంలో టెలిఫోన్ వైరు (Telephone wire) తో ఉరి వేసుకొని మృతిచెందినట్లు గుర్తించిన విద్యార్థులు వార్డెన్ మేరి కి తెలిపారు.
వార్డెన్ సమాచారం మేరకు డోన్ పట్టణ సీ.ఐ ఇంతియాజ్ సంఘటన స్థలానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సంఘటన జరిగిన స్థలాన్ని డోన్ ఆర్డీఓ నరసింహులు (RDO Narasimhulu), జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి జగ్గయ్య, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి ఓబులేసులు మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై హాస్టల్ వార్డెన్ మేరీ (Hostel Warden Mary) తో పాటు విద్యార్థులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తమ కుమారుడు ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాడని, కానీ ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావటం లేదని తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమారుడును ఎవరో చంపి ఉరి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

