ఇండియాతో ఫ్రెండ్ షిప్ కోసం డ్రాగన్ అన్ని ప్రయత్నాలు
ప్రధాని మోడీకి రెడ్ కార్పెట్ తో వెల్కం
ప్రధాని మోడీ నేడు జిన్ పింగ్ , రేపు పుతిన్ తో భేటీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత్, చైనాల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్నది. అమెరికా అన్ని దేశాలపై ఇబ్బడిముబ్బడిగా టారిఫ్‌లతో యుద్ధం ప్రకటించిన వేళ చైనా.. భారత్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గాల్వన్ ఘర్షణలతో పూర్తిగా దూరమైన చైనా మళ్లీ సంబంధాలు పూర్తిస్థాయిలో పునరుద్దరించుకోవడానికి ద్వారాలు తెరిచి ఇండియాకు స్వాగతం పలుకుతున్నది. ఇందులో భాగంగానే ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో వరుస సమావేశాలు జరిపారు.
అన్ని సంబంధాలు పునరుద్ధరించు కోవాలని, సరిహద్దు గుండా వాణిజ్యం, వీలైనంత త్వరగా వైమానిక సేవలు పున: ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇందుకు ఉభయులూ ప్రాథమికంగా అంగీకారానికి వచ్చారు. అలాగే.. భారత ప్రధానిని చైనాకు ఆహ్వానించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందేశాన్నీ అందించి వెళ్లారు. ప్రస్తుత అస్థిర భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్, చైనాల బంధం సుస్థిర వాణిజ్యానికి పునాది వేయగలదని ప్రధాని మోడీ మొన్ననే పేర్కొన్నారు.
ఈ రెండు దేశాల సంబంధాలు చైనాలో ప్రధాని మోడీ అజెండా
టియాంజిన్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం
చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగే ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారు. ఆదివారం నిర్వహించే బాంక్విట్ డిన్నర్ కు ప్రధాని మోడీ హాజరవుతారు. ప్రధాన నాయకుల సదస్సు రేపు జరుగుతుంది. ఈ సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మరోసారి ఉగ్రవాదంపై ప్రధాని మోడీ మాట్లాడే అవకాశమున్నది. అలాగే.. నేడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతారు. ఇంకా పలువురు నేతలతో సమావేశాలు ఉంటాయి.
మైత్రివైపు భారత్, చైనాల అడుగు..
ప్రాంతీయంగానే కాదు.. యావత్ ప్రపంచానికి లాభదాయకమని వివరించడం.. చైనాతో మైత్రికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతనూ వెల్లడిస్తున్నది. జిన్‌పింగ్ ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరవ్వడానికి వెళ్లారు. జపాన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా రెండో రోజుల పర్యటన నిమిత్తం టియాంజిన్‌లో ప్రధాని మోడీ అడుగుపెట్టగా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి డ్రాగన్ కంట్రీ వెల్కం చెప్పింది. ఈ పరిణామాలు భారత్ తో రిలేషన్ వీలైనంత గాఢంగా, వీలైనంత వేగంగా సరిదిద్దుకోవాలనే చైనా తాపత్రయాన్ని వెల్లడిస్తున్నట్టు చెబుతున్నారు.
భారత్, చైనాలది శతాబ్దాల బంధం
2020లో గాల్వన్ లోయ ఘర్షణలు జరిగినప్పటి నుంచి భారత్, చైనాల మధ్య సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్‌లు గుప్పిస్తున్న వేళ వేగంగా చక్కబడుతు న్నాయి. మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడిప్పుడే స్నేహహస్తాన్ని అందించుకుని మిత్రులుగా మారుతున్నాయి.
ట్రంప్ టారిఫ్ కు కౌంటర్..?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని అదనంగా 25 శాతం సుంకాలతో మొత్తంగా 50 శాతం సుంకాలను భారత్ పై అమెరికా విధించింది. రష్యాపై వీలైనన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య ముఖ్యంగా అమెరికా పెత్తనానికి కౌంటర్ గా బహుళపక్ష ప్రపంచ విధానానికి మద్దతు పెరుగుతున్నది. పాశ్చాత్య దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా బహుళపక్ష విధానాల కోసం పాటుపడే కూటమిగా పేరున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను ప్రాధాన్యత పెరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని హాజరవ్వడం.. రష్యా, చైనా, భారత్ ల మధ్య సానుకూల వాతావరణాన్ని సూచిస్తున్నది. భారత్ అటు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకుంటూనే చైనాతోనూ వాణిజ్య సంబంధాలు నెరిపి మన పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా బహుళపక్ష విధానానికీ గొంతు కలిపిన భారత్ ఈ సదస్సుకు హాజరవ్వడం గమనార్హం.
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఏ దేశాన్ని శత్రువుగా చూడదని స్పష్టం చేశారు. ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని మోడీ వెళ్లిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రక్షణలో స్వదేశీ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవల నేవీలో చేరిన నీలగిరి క్లాస్ స్టైల్త్ ఫ్రిగేట్లు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరిని గుర్తుచేశారు. అలాగే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసే రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

