- పబ్లిక్ సందర్శనార్థం అమృత్ ఉద్యాన్
- సెప్టెంబర్ 14వ తేదీ వరకు అనుమతి
న్యూఢిల్లీ – ఆంధ్రప్రభ ప్రతినిధి : ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. పబ్లిక్ సందర్శనార్థం ఈనెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు రాష్ట్రపతి భవనంలోని అమృత్ ఉద్యాన్‌ను తెరిచి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 29న శుక్రవారం నేషనల్ స్పోర్ట్స్ డే, సెప్టెంబర్ 5న టీచర్స్ డే పురస్కరించుకుని… క్రీడాకారులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రపతి భవన్ సందర్శకులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుందని అధికారులు వివరించారు.
అమృత్ ఉద్యాన్ నిర్వహణ నిమిత్తం రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యానవనంలో… బోన్సాయ్ గార్డెన్, సెంట్రల్ లాన్, బాలవాటిక, హెర్బల్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్, లాంగ్ గార్డెన్ వంటివి సందర్శనలో ఉండనున్నాయి. ప్రతి మొక్కకు ఉన్న క్యూఆర్ కోడ్ తో ఆ మొక్క జాతి, హిస్టరీ తెలుసుకోవచ్చు.
అమృత్ ఉద్యాన్ సందర్శించాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రపతి భవన్ నార్త్ అవెన్యూ వద్ద 35వ ఎంట్రీ గేట్ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
లోపలికి ప్రవేశించే వారికి మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, హ్యాండ్‌బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అనుమతిస్తారు. ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ సందర్శనకు సెలవు అని అధికారులు స్పష్టం చేశారు.


