ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: 2025 యూఎస్ ఓపెన్ (US Open 2025)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో టైటిల్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. పురుషుల డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ ఈ ఏడాది కూడా ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నారు. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో అల్కరాజ్ గెలిస్తే, వింబుల్డన్‌లో సినర్ విజయం సాధించి ఇద్దరూ సమానంగా ఉన్నారు.
ఈ టోర్నమెంట్‌లో అల్కరాజ్‌కు మెద్వెదెవ్, జొకోవిచ్ రూపంలో పెద్ద సవాళ్లు ఎదురవనున్నాయి. ఒకవేళ ఇద్దరూ ముందుకు సాగితే, సెమీస్‌లో వీరిద్దరి మధ్య పోరు తప్పకపోవచ్చు. గతంలో వీరిద్దరి ముఖాముఖిలో నోవాక్ జొకోవిచ్ 5-3తో అల్కరాజ్‌పై పైచేయి సాధించాడు. మరోవైపు, టాప్ సీడ్ సినర్ సెమీస్‌లో మూడో సీడ్ జ్వెరెవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అరియానా సబలెంక తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణిగా నిలిచేందుకు ఆమె సిద్ధంగా ఉంది. అయితే, రెండో సీడ్ స్వియటెక్, మూడో సీడ్ కోకో గాఫ్ నుంచి సబలెంకకు కఠినమైన పోటీ ఎదురుకావచ్చు. వీరందరితో పాటు జెస్సికా పెగుల, ఆండ్రీవ వంటి ఇతర సీడెడ్ క్రీడాకారిణులు కూడా టైటిల్ కోసం పోరాడనున్నారు. మొత్తానికి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ అభిమానులకు మంచి విందు అందించే అవకాశం ఉంది. ఆదివారం నుంచి జరిగే ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఎవరిది పైచేయిగా అవుతుందో చూడాలి.