భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా కేంద్రం గాంధీనగర్ అర్బన్ రెసిడెన్స్ పాఠశాలలో నిన్న కలుషిత నీటిని తాగి 12 మంది విద్యార్థులు అస్వస్థత గురైన విషయం విధితమే. అయితే జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (MLA Gandra Satyanarayana Rao), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్, విజయలక్ష్మి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడి నుండి నేరుగా వసతి గృహానికి చేరుకొని జరిగిన ఘటనపై ప్రతి విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ఆవరణలో ఓ టీచర్ గదిలో ఉన్న దగ్గు మందు సీసాలో ఉన్నవిష ద్రావణాన్ని అధికారులు గుర్తించారు. ఓ టీచర్.. నీటిలో ఈ ద్రావణం కలిపినట్లు విద్యార్థులు (students) చెబుతున్నారు. ఎమ్మెల్యే, అధికారులు విద్యార్థులతో మాట్లాడి టీచర్ల గ్రూపు తగాదాల వల్లే ఈ దారుణ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
గ్రూపు తగదాతోనే పిల్లలను ఆగం చేసే కుట్ర?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (Gandra Satyanarayana Rao) మాట్లాడుతూ సైన్స్, మాథ్స్ టీచర్లు, ఎస్ఓ ( హెచ్ఎం) ల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయని తెలుస్తుందన్నారు. అయితే వారి తగాదాల్లో పిల్లలను ఆగం చేసే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు వసతి గృహాల్లో అన్నిసౌకర్యాలు కల్పిస్తుందని మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు కూడా పెంచిందన్నారు. గతంలో కొరికిశాలలో ఎస్ఓ, పీఈటీ (SO, PET) మధ్యలో విభేదంతో ఇలానే జరిగిందని గుర్తు చేశారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందుతుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు : కలెక్టర్ శర్మ
అర్బన్ రెసిడెన్స్ పాఠశాలలో జరిగిన ఘటన విచారకరమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) అన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి హాస్టల్ ను సందర్శిస్తామని, ఇప్పటికే వసతిగృహాలకు నోడల్ అధికారుల (Nodal Officers) ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేక టీం ఏర్పాటు : ఎస్పీ
వసతి గృహంలో జరిగిన ఘటనపై ప్రత్యేక టీం (Special team) ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ ఘాతుకాన్ని పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.