బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో ఇండియన్ సినిమా రేంజ్‌ని గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి… ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో మరో యాక్ష‌న్-అడ్వెంచరస్ హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నాడు.

ఈ భారీ ప్రాజెక్ట్ బడ్జెట్ ఏకంగా రూ.1000 కోట్ల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆ స్థాయికి తగ్గట్టే అభిమానుల అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

అయితే, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి జక్కన్న నుంచి ఎటువంటి అప్డేట్స్ రాలేదు. కానీ మహేశ్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9)న మాత్రం చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. “SSMB29 టైటిల్ & ఫస్ట్ లుక్ నవంబర్‌లో వస్తుంది” అంటూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

నవంబర్‌లోనే ఎందుకు?

ఇక అభిమానులు, నెటిజన్లు మాత్రం “నవంబర్‌లోనే ఎందుకు?” అని ఊహాగానాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ సంచలన సమాచారం బయటకొచ్చింది. టాక్ ఏంటంటే… ఈ టైటిల్ లాంచ్‌ని ఎవరో కాదు, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

కామెరూన్ ప్రస్తుతం అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్ల కోసం కామెరూన్ నవంబర్‌లో ఇండియాకి రానున్నాడు. దే సమయాన్ని వాడుకునే ఆలోచనలో ఉన్నారట జక్కన్న‌.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, RRR మూవీ ఆస్కార్ జ‌ర్నీ టైంలో జేమ్స్ కామెరాన్ పబ్లిక్‌గా రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తాడు. “మీరు హాలీవుడ్‌లో సినిమా చేయాలనుకుంటే, మనం మాట్లాడుకుందాం” అంటూ ఆయన ఆహ్వానం కూడా ఇచ్చాడు. అప్పట్లో వారి వీడియో ఇంటరాక్షన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు నిజంగానే కామెరాన్ చేతుల మీదుగా SSMB29 టైటిల్ లాంచ్ జరిగితే… ఈ ప్రాజెక్ట్‌కి స్టార్ట్ నుంచే గ్లోబల్ రీచ్ ఖాయం అంటూ ఉర్రూత‌లూగుతున్నారు అభిమానులు! అంతేకాదు, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారనే వార్తలు కూడా అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి.

ఒకవైపు సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి… దానికి తోడు హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా టైటిల్ లాంచ్ జరుగుతుందనే టాక్… ఈ కాంబినేషన్ వింటేనే అభిమానుల్లో జోష్ మ‌రింత పెరిగింది.

ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఇంతటి స్థాయి గ్లోబల్ అటెన్షన్ దక్కించుకోవడం చాలా అరుదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి తదుపరి అడ్వెంచర్‌పై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొన్నది. ఇప్పుడు జేమ్స్ కామెరాన్ పేరు జోడించడంతో, ఈ ప్రాజెక్ట్ పట్ల అంచనాలు హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయాయి.

Leave a Reply